భూ కబ్జాల నిరోధానికి ప్రత్యేక చట్టం

  • శాసనసభలో ఆమోదం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భూ కబ్జాలను నిరోధించేందుకు రూపొందించిన ల్యాండ్‌ గ్రాబింగ్‌ నిషేధ చట్టానికి శాసనసభ గురువారం ఆమోదించింది. ఎక్కడ భూమి కబ్జా చేసినా ఈ చట్టం ప్రకారం శిక్షార్హులవుతారు. భూ కబ్జాకు ప్రయత్నించినా, బెదిరించినా ఈ చట్టం ప్రకారం శిక్షించే అవకాశాన్ని కల్పించారు. అయితే ల్యాండ్‌ కబ్జా చేయలేదని ఆరోపణకు గురైన వారే నిరూపించుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. చర్చ ముగింపులో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తనకు వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం భూ కబ్జాలపైనే ఉంటున్నాయన్నారు. అందుకే ఈసారి కఠిమైన చట్టాన్ని తెస్తున్నామని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో అధ్యయనం చేశాక యాంటీ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టు తెచ్చామన్నారు. ఎవరైనా ఎదుటివారి భూములను ఆక్రమిస్తే ఈ చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు. వారు ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకుని నిందితులను జైలుకు పంపుతామన్నారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పిడి యాక్టుకు కూడా పదును పెడుతున్నామన్నారు. పకడ్బందీగా చట్టం ఉంటేనే అక్రమదారులు భయపడతారని తెలిపారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డవారిని 6 నెలల్లోనే శిక్షిస్తామన్నారు. కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు. డిఎస్‌పి కన్నా పైస్థాయి అధికారి ఈ కేసులపై విచారణ జరుపుతారన్నారు.

➡️