- రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : మంత్రి అనగాని
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని, భవిష్యత్తులో భూ వివాదాలు లేకుండా చర్యలు చేపడుతోందని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రీసర్వేపై గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. గ్రామ సభలలో వచ్చిన వినతులు, రీ ఓపెన్ కాకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్‌ఎస్‌లో వచ్చే దరఖాస్తులలో ఆర్‌ఒఆర్, రీ సర్వే, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, 22ఎ నుండి తొలగింపులు, ఇళ్ల స్థలాల మంజూరుకు ఎక్కువగా వస్తున్నాయని, వాటిని పరిశీలించి రీ ఓపెన్ కాకుండా పరిష్కరిస్తున్నామని మంత్రికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ వివరించారు. విశాఖలో 22ఎ లో ఇళ్లపై వినతులు ఎక్కువగా వస్తున్నాయని, ప్రత్యేకంగా వాటిపై దృష్టి పెట్టినట్లు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్, రెవెన్యూ డివిజనల్ అధికారులు శ్రీలేఖ, సంగీత్‌మాదూర్, మండల రెవెన్యూ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.