పన్నుల వాటాలో ప్రత్యేక బోనస్‌

  • ఆర్థిక సంఘానికి వైసిపి విజ్ఞప్తి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : gపన్నుల వాటా లెక్కకు 2011 జనాభాను పరిగణనలోకి తీసుకున్నారని, 1971 తరువాత పలు రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, దీనివల్ల ఆయా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆర్థికశాఖ మాజీ మంత్రి, వైసిపి నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. 16వ ఆర్థిక సంఘానికి వైసిపి తరపున వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాలకు పన్నుల వాటాలో 50 శాతం ఇవ్వాలని కోరారు. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు పన్నుల వాటాల్లో ప్రత్యేక బోనస్‌ ఇవ్వాలని కోరారు. 14వ ఆర్థిక సంఘంలో డాక్టర్‌ వైవి రెడ్డి రాష్ట్రాల వాటాను 32 శాతం నుండి 42 శాతానికి పెంచుతూ సిఫార్సు చేశారని తెలిపారు. 15వ ఆర్థిక సంఘం డాక్టర్‌ ఎన్‌కె సింగ్‌ 41 శాతం ఇచ్చారని, 42 శాతం సిఫార్సు చేసినా వాస్తవంగా నిధులు వచ్చే సరికి పదిశాతం తగ్గుతున్నాయని పేర్కొన్నారు. అంటే రాష్ట్రానికి నికరంగా వచ్చేది 32 శాతమేనని తెలిపారు. కేంద్రం సెస్సులు, సర్‌ఛార్జీల పేరుతో కోత పెడుతోందన్నారు. ఈ నేపథ్యంలో పన్నుల వాటాలో 50 శాతం నిధులు రాష్ట్రాలకు ఇవ్వాలని వైసిపి తరపున కోరామని వివరించారు. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ తర్వాత 14, 15 ఆర్థిక సంఘాలు వచ్చాయని, 14వ ఆర్థిక సంఘం సమయంలో టిడిపి, 15వ ఆర్థిక సంఘం సమయంలో వైసిపి అధికారంలో ఉన్నాయని తెలిపారు. టిడిపి ప్రభుత్వ హయాంలో 2014-19 మధ్యలో ఎక్కువ అప్పు చేశారని అన్నారు. 2019-20 మధ్యలో కోవిడ్‌ ఉన్నా వైసిపి ప్రభుత్వంలో చేసిన అప్పు శాతం తక్కువని పేర్కొన్నారు. ఈ లెక్కలను కేంద్ర ప్రభుత్వ విభాగాలే తేల్చిచెబుతున్నాయని వివరించారు. వైసిపి ప్రభుత్వంపై విషం చిమ్మిన వారందరూ ఇప్పుడు ఏమయ్యారని రాజేంద్రనాథ్‌ ప్రశ్నించారు. రాజధాని విషయంలోనూ ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు.

➡️