పోలింగ్‌కు ప్రత్యేక బస్సులు

May 12,2024 09:25 #APSRTC

– హైదరాబాద్‌ నుంచి 339, బెంగళూరు నుంచి 323 సర్వీసులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రకటించింది. ఈ నెల 13న రాష్ట్రంలో పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుందటంతో హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రెగ్యులర్‌గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు ఏర్పాటు చేశామని ఎపిఎస్‌ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు తెలిపారు. హైదరాబాద్‌నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడిచే 339 సర్వీసులతోపాటు ఈ నెల 11వ తేదీన 302, 12వ తేదీన 206 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఒంగోలుకు 38, ఏలూరుకు 20, మచిలీపట్నంకు 23, విజయవాడకు 45, గుంటూరుకు 18, నరసరావుపేటకు 26, నెల్లూరుకు 17, నంద్యాలకు 19, విశాఖకు నాలుగు సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు. బెంగళూరు నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 11వ తేదీన 323 సర్వీసులు, 12వ తేదీన 269 బస్సులను నడుపుతున్నామని, రెగ్యులర్‌గా నడిచే బస్సులకు ఇవి అదనం అని ప్రకటించారు. విజయవాడ నుంచి విశాఖ, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు ప్రాంతాలకూ ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయని చెప్పారు. ఈ బస్సు సర్వీసులన్నీ సాధారణ ఛార్జితోనే నడుస్తున్నాయని, ఓటు వేసి తిరుగు ప్రయాణమయ్యే వారి కోసమూ ప్రత్యేక సర్వీసులు ఉంటాయని ఆయన తెలిపారు.

➡️