సంక్షోభంలో స్పిన్నింగ్‌ మిల్లులు

– భారంగా మారిన విద్యుత్‌ ఛార్జీలు
– తెలంగాణ తరహా రాయితీలు అవసరం అంటున్న నిర్వహకులు
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో స్పిన్నింగ్‌, జిన్నింగ్‌ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకుంది. గత కొంత కాలంగా విద్యుత్‌ ఛార్జీల భారంతో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన ఒడిదుడుకుల వల్ల మిల్లుల నిర్వహణ భారంగా మారింది. మిల్లుల నిర్వహకులకు గత ఆరేళ్లుగా విద్యుత్‌ మినహాయింపులు రావడం లేదు. ఒకప్పుడు అభివృద్ధి పథంలో ఉన్న ఎపి స్పిన్నింగ్‌ పరిశ్రమ ఇప్పుడు పతనం అంచుకు చేరుతోంది. 2003లో కేవలం రెండు లక్షల స్పిండిల్స్‌తో ప్రారంభం అయిన ఈ పరిశ్రమ 2013 నాటికి 35 లక్షల స్పిండిల్స్‌కు విస్తరించింది. 12 లక్షల మంది ప్రత్యక్షóంగా మరో లక్ష మందికి పరోక్ష ఉపాధిని ఈ పరిశ్రమ కల్పించింది. ముడి పత్తి లభ్యత, తక్కువ విద్యుత్‌ వ్యయం, పరిశ్రమ అభివృద్ధికి పాలకుల ప్రోత్సాహం ఉండం వల్ల పదేళ్ల క్రితం వరకూఈ పరిశ్రమ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక భూమిక పోషించింది. పాలకుల విధానాల కారణంగా గత దశాబ్ధాకాలంలో ఈ పరిశ్రమ దశలవారీగా క్షీణతకు చేరుకుంది.
2012ా13 నాటికి విద్యుత్‌ సంక్షోభం సమయంలో పరిశ్రమకు తొలిసారిగా సవాళ్లు ప్రారంభమయ్యాయి. విద్యుత్‌ సరఫరాలో 50 శాతం కోత పెట్టడం వల్ల ఉత్పత్తిలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. 2014లో అప్పటి ప్రభుత్వం రూ.1500 కోట్ల రాయితీలను ప్రకటించినా ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. 2019కు ముందు యూనిట్‌కు రూ.ఆరు చెల్లిస్తుండగా 2019ా24 మధ్య కాలంలో యూనిట్‌ విద్యుత్‌కు రూ.10 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఎన్నికల తరువాత విద్యుత్‌ ఛార్జీల భారం మరింత పెరిగింది. ట్రూ అప్‌, ఎఫ్‌ పిసిసిఎ ఛార్జీలతో కలిసి యూనిట్‌కు రూ.12 చెల్లించాల్సి వస్తోంది. విద్యుత్‌ భారంతో పాటు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో వస్త్ర పరిశ్రమపై రూ.212 కోట్ల పన్నుల భారం మోపారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ వాతావరణం వంటి ఇతర కారణాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా పత్తి ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 40 శాతం మిల్లులు మూతపడ్డాయి. మరో 10 నుంచి 15 శాతం వరకు మిల్లులు నష్టాల బాటలో ఉన్నాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పరిశ్రమకు ప్రోత్సాహం కొరవడింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి సబ్సిడీ బకాయిలు విడుదల కాలేదు.

విద్యుత్‌ సుంకాలను తగ్గించాలి
– ఎపి టెక్స్‌టైల్‌ మిల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కోటిరావు
స్పిన్నింగ్‌, జిన్నింగ్‌ మిల్లులకు భారంగా మారిన విద్యుత్‌ సుంకాలను తగ్గించాలి. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా టెక్స్‌టైల్స్‌ పరిశ్రమకు యూనిట్‌ రూ.రెండు చొప్పున విద్యుత్‌ రాయితీ ఇవ్వాలి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో విద్యుత్‌ రంగంలో జరిగిన అనుబంధ విధానాలను సమీక్షించి పెంచిన విద్యుత్‌ ఛార్జీల నుంచి టెక్స్‌టైల్‌ పరిశ్రమకు మినహాయింపు కావాలి. గుజరాత్‌, మహరాష్ట్ర, బీహార్‌, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్‌ విధానాలు, సబ్సిడీలను అమలు చేయాలి. తక్షణం ప్రభుత్వం స్పందించిన టెక్స్‌టైల్‌ పరిశ్రమను కాపాడటానికి కృషి చేయాలి.

➡️