యుటిఎఫ్ రాష్ట్ర క్రీడల ప్రారంభోత్సవంలో వక్తలు
ఉత్సాహంగా ప్రారంభమైన క్రీడలు
ప్రజాశక్తి-గుంటూరు : ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ఉపాధ్యాయులు క్రీడా స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందని ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు అన్నారు. యుటిఎఫ్ ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ మహాసభలో భాగంగా ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడ్రోజులపాటు జరిగే ఈ క్రీడా పోటీలను గుంటూరు ఎన్‌టిఆర్ స్టేడియంలో క్రీడాజ్యోతి వెలిగించి, బెలూన్లు ఎగురవేసి ప్రారంభించారు. యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ 50 ఏళ్ల యుటిఎఫ్ సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యమాల ద్వారా అనేక ఘన విజయాలు సాధించిందన్నారు. నేడు దేశంలో ప్రభుత్వ విద్యారంగ భవిష్యత్తుకు పెను సవాలుగా మారిన నూతన జాతీయ విద్యావిధానాన్ని ఉపాధ్యాయులు చైతన్యంతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో గ్రామీణ క్రీడలు అంతరించి పోతున్నాయని, క్రీడా స్ఫూర్తి తగ్గిపోతుందన్నారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ క్రీడలు, వ్యాయామం అవసరమన్నారు. విద్యార్థులను విద్యతోపాటు, క్రీడల్లోనూ విరివిగా ప్రోత్సహించాలన్నారు. ఎపి జెఎసి చైర్మన్ కెవి శివారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిరంతరం ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో మొదట జాతీయ జెండాను ఎమ్మెల్సీ లక్ష్మణరావు, యుటిఎఫ్ పతాకాన్ని యుటిఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జోజయ్య ఎగురవేశారు. రాష్ట్రంలోని క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరై జిల్లాల వారీగా క్రీడా పతాకాలు చేతబూని నిర్వహించిన మార్చ్‌ఫాస్ట్ ఆకట్టుకుంది. క్రీడాకారులు అథ్లెటిక్స్, షటిల్, క్యారమ్స్, క్రికెట్ తదితర 15 అంశాల్లో జిల్లా స్థాయిలో ఎంపికైన వారు రాష్ట్ర స్థాయిలో పోటీ పడ్డారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కెఎస్‌ఎస్ ప్రసాద్, రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎన్ కుసుమకుమారి, రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె శ్రీనివాసరావు, కోశాధికారి బి గోపిమూర్తి తదితరులు పాల్గన్నారు.