ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : ఎగవ నుంచి వస్తున్న వరద నీరు, అల్ప పీడన గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో వశిష్ట గోదావరి ఉధృత రూపం దాల్చింది. గత నాలుగు రోజులుగా నీటిమట్టం పెరుగుతుండడంతో గోదావరి నడుమ జీవిస్తున్న లంకవాసుల్లో ఆందోళన మొదలైంది. ధవలేశ్వరం వద్ద నీటి విడుదలను పెంచడంతో దిగువన నియోజకవర్గం పరిధిలో లంక గ్రామాలు ముంపు బారిన పడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తీరం వెంబడి ఉన్న పుష్కర ఘాటులు నీటిమనగడం ప్రారంభమయ్యాయి. ఆచంట మండలం పెదమల్లంలో ప్రసిద్ధి మాచేనమ్మ వారి ఆలయం వద్ద పుష్కర ఘాటు, కరుగోరుమిల్లి ఇసుక ర్యాంపు వద్ద మరో పుష్కర ఘాటు పూర్తిగా నీట మునిగాయి. నీటి ప్రవాహం పెరగడంతో పల్లపు ప్రాంతాల్లోని లంక భూముల్లోకి వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం లంక భూముల్లో విలువైన పంటలు ఉండడంతో లంక గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. గోదావరికి వరద ఉధృతంగా మారడం మరో ప్రక్క నీటి ప్రవాహ వేగం కూడా బాగా పెరగడంతో గోదావరి నదిపై నాటు పడవల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రస్తుతం అయోధ్య లంక, పెద్దమల్లం, పల్లిపాలెం, తదితర గ్రామాలకు రాకపోకలు కష్టంగా మారాయి. కోడేరు, కరుగోరుమిల్లి, పెదమల్లం రేవుల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. నాటు పడవలను నిలిపేయడంతో ఇంజన్ పడవలపై ప్రయాణాలు సాగించేందుకు లంకవాసులు ఏర్పాటు చేస్తున్నారు.
