– కదిరిలో 16 మంది కౌన్సిలర్ల రాజీనామాలు
ప్రజాశక్తి-కదిరి అర్బన్ శ్రీ సత్యసాయి జిల్లా అధికార పార్టీలో టికెట్ కేటాయింపు వ్యవహారం చిచ్చురాజేసింది. సిట్టింగ్‌లకు కాకుండా ఇతరులకు టికెట్టు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేశారు. కదిరి నియోజకవర్గానికి సంబంధించి 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి కాకుండా మరొక వ్యక్తికి టికెట్టు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కదిరి మున్సిపాల్టీకి చెందిన కౌన్సిలర్లు గురువారం వారి పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కదిరిలో అసమ్మతి నాయకులు రాజీనామా లేఖలను మీడియా ఎదుట చూపించారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి మద్దతుగా 16 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్ సభ్యులు రాజీనామా చేసినట్లు కౌన్సిలర్ నూరుల్లా ఖాసీంవలి, సాయి ప్రణీత్‌రెడ్డిలు తెలిపారు. పెనుకొండలో శంకర్‌నారాయణకే టికెట్టు ఇవ్వాలి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకరనారాయణకు కాకుండా మంత్రి ఉష శ్రీచరణ్‌కు టికెట్టు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెనుకొండ నియోజకవర్గం పరిధిలోని పెనుకొండ, సోమందేపల్లి, గోరంట్ల మండలాల్లో వైసిపి నాయకులు నిరసన తెలిపారు.