శ్రీశ్రీ కుమారుడు వెంకటరమణ కన్నుమూత

– అమెరికాలో ముగిసిన అంత్యక్రియలు
ప్రజాశక్తి – గుంటూరు :మహాకవి శ్రీశ్రీ కుమారుడు శ్రీరంగం వెంకట రమణ (59) అనారోగ్య కారణాలతో గురువారం అమెరికాలోని కనెక్టికల్‌ రాష్ట్రంలోని ఆయన స్వగృమంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని గుంటూరులోని వారి బంధువు డాక్టర్‌ రమణ యశస్వి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరంగం వెంకటరమణకి భార్య మాధవి, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె కవిత ఉన్నారు. ఆయన భార్యది పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం గణపవరం గ్రామం. శుక్రవారం సాయంత్రం అమెరికాలో వెంకట రమణ అంత్యక్రియలు పూర్తి అయినట్లు డాక్టర్‌ రమణా యశస్వి తెలిపారు. పాతికేళ్ల క్రితం శ్రీరంగం వెంకటరమణ ఆమెరికా వెళ్లారు. అక్కడే ఫైజర్‌ కంపెనీ పరిశోధనా విభాగంలో పనిచేశారు. మహాకవి శ్రీశ్రీ భార్య సరోజా శ్రీశ్రీ 80 సంవత్సరాల వయస్సులో కుమారుడిని కోల్పోయారని, ఆమెకు, వెంకటరమణ కుటుంబ సభ్యులకు సాహితీ వేత్తలు సంతాపం తెలిపారు. అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్దప్రసాద్‌, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి జివి పూర్ణచంద్‌ తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

➡️