15న అమరావతిలో శ్రీనివాస కళ్యాణం

Mar 13,2025 21:32 #ttd

టిటిడి ఛైర్మన్‌ బిఆర్‌ నాయుడు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అమరావతి రాజధాని ప్రాంతం వెంకటపాలెం సీడ్‌ యాక్సిస్‌ రోడ్డులోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 15న శనివారం సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 వరకు శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టిటిడి ఛైర్మన్‌ బిఆర్‌ నాయుడు తెలిపారు. గురువారం వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయ ప్రాంగణంలో టిటిడి ఇఓ శ్యామలరావు, టిటిడి బోర్డు మెంబర్లతో కలిసి కల్యాణోత్సవం ఏర్పాట్లపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సిఎం ఆదేశాల మేరకు శ్రీనివాస కళ్యాణోత్సవం అనంతరం అమరావతి పనుల పునర్నిర్మాణానికి అంకురార్పణ చేస్తారన్నారు. మొదటి విడతగా సుమారు రూ.37 వేల కోట్లతో పనులు ప్రారంభించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవం జరగనుండటం ఆనందంగా ఉందని బిఆర్‌ నాయుడు తెలిపారు. అమరావతి రైతులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించామన్నారు. కల్యాణోత్సవం కార్యక్రమంలో సిఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు, ప్రజాప్రతినిధులు , రాజధాని రైతులు, ప్రజలు పాల్గనాలని కోరారు. టిటిడి ఇఓ శ్యామలరావు మాట్లాడుతూ శ్రీనివాస కళ్యాణోత్సవానికి హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడి, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కళ్యాణ వేదిక నిర్మాణంతో పాటు 27వేలమంది తిలకించేందుకు సదుపాయాలు కల్పిస్తున్నామని, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీ బోర్డులు హోర్డింగులు ఏర్పాటు చేశామని చెప్పారు.

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రుల బృందం
ఈనెల 15న టిటిడి ఆధ్వర్యాన జరగనున్న శ్రీనివాస కల్యాణోత్సవం ఏర్పాట్లను గురువారం మంత్రుల బృందం పరిశీలించింది. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్‌, పి.నారాయణ, టిటిడి ఛైర్మన్‌ బిఆర్‌ నాయుడు, టిటిడి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మి, ఎం.శాంతారామ్‌, ఎంఎస్‌ రాజు, ఇఓ శ్యామలరావు, డిఐజి సర్వశ్రేష్టి త్రిపాఠి, అదనపు ఇఓ సిహెచ్‌ వెంకయ్య చౌదరి, దేవాదాయ శాఖ కార్యదర్శి వినరుచంద్‌, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, టిటిడి జెఇఓ వి.వీరబ్రహ్మం, ఎస్‌పి సతీష్‌కుమార్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

➡️