- నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపు
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : నిరాదరణకు గురైన బాలబాలికల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని, వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నోబెల్ బహుమతి గ్రహీత, బాలల హక్కుల కార్యకర్త కైలాష్ సత్యార్థి పేర్కొన్నారు. బాలల హక్కులపై ‘బంగారు బాల్యం’ పేరుతో ఒంగోలులోని రిమ్స్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం గురువారం నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో ‘బాలల బంగారు భవిష్యత్ వైపు ప్రకాశం జిల్లా -100 శాతం సాధన దిశగా’ కాన్సెప్ట్‌తో రూపొందించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కైలాష్ సత్యార్ధి మాట్లాడుతూ ప్రతి బిడ్డ సురక్షితంగా, స్వేచ్ఛగా, ఆరోగ్యంగా, విద్యావంతులుగా ఉండేలా బాలల రక్షణ, పిల్లల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందన్నారు. బాలల హక్కులు కాపాడడం, సమాజంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కషి చేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ బంగారు బాల్యం కార్యక్రమానికి కలెక్టర్ వినూత్నంగా రూపకల్పనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలోకలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా, జిల్లా ఎస్‌పి ఎఆర్ దామోదర్, సంయుక్త కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ పాల్గొన్నారు.