నిర్మాణంలో ఉన్న భవనాలు త్వరలో ప్రారంభం

Jun 10,2024 08:17 #crda, #cs visit
  • అమరావతిలో 25 భవనాలను పరిశీలించిన సిఎస్‌
  •  సిఆర్‌డిఎ భవన పనులు వేగవంతం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని పరిధిలో నిర్మాణంలో ఉన్న 25 భవనాలను త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ అమరావతి పరిధిలో పర్యటించారు. నిర్మాణంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నాలుగో తరగతి ఉద్యోగులు, ఎన్‌జిఒల భవనాలను పరిశీలించారు. అలాగే రాయపూడి పరిధిలో ఉన్న సిఆర్‌డిఎ భవనంలో మొదలుపెట్టిన పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుండి ఉద్దండ్రాయునిపాలెంలో గతంలో ప్రధాని శంకుస్థాపన చేసిన స్థలాన్ని, సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. వెంకటపాలెంలో నిర్మాణంలో ఉన్న పేదల ఇళ్లను చూశారు. అనంతరం రాయపూడిలోని సిఆర్‌డిఎ కార్యాలయం సమీపంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యంగా సిఆర్‌డిఎ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అమరావతిని ప్రాధాన్యతగా తీసుకుందని, ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. రాజధాని పరిధిలో పెద్దయెత్తున పిచ్చిమొక్కలు ఉన్నాయని, వాటిని 100 జెసిబిలతో తొలగిస్తున్నామని చెప్పారు. మొదటిదశలో జంగిల్‌ క్లియరెన్స్‌ చేయాలని సిఆర్‌డిఎ కమిషనర్‌ను ఆదేశించామని తెలిపారు. కరకట్ట రోడ్డు నుండి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, శంకుస్థాపన ప్రాంతం, సిఆర్‌డిఎ కార్యాలయం, 10 ఎంఎల్‌డి వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు, అపార్టు మెంట్లు, ఆలిండియా అధికారుల భవనాలు, హైకోర్టు, జ్యుడీషియల్‌ కాంప్లెక్స్‌, హైకోర్టు, గ్రూప్‌ డి ఉద్యోగుల భవనాల దగ్గర వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం సమీక్షించి దానికి నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొత్తంగా 25 ప్రాంతాల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు. ప్రతి పని గురించీ వేర్వేరుగా సమీక్ష చేస్తున్నామని చెప్పారు. జ్యుడీషియల్‌ ఉద్యోగుల భవనాల వద్ద దారి కూడా సరిగ్గా లేదని గుర్తించామని, దీంతోపాటు విద్యా సంస్థలైన అమృత, విట్‌, ఎస్‌ఆర్‌ఎంలకు వెళ్లేదారిని వెంటనే క్లియర్‌ చేయాలని నిర్ణయించారు. హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్‌ ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులకు కేటాయించిన భవనాల్లో పిచ్చిమొక్కలు తొలగించడంతోపాటు, అక్కడ నివాసానికి వీలుగా అవసరమైన సదుపాయాలకు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఉన్నతాధికారుల భవనాలను సిద్ధం చేసి అధికారులందరూ అక్కడకు వచ్చేలా చూడాలని నిర్ణయించారని, దానికి అనుగుణంగా వీలైనంత త్వరగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పనుల ప్రాధాన్యత ఆధారంగా వాటిని వరుస క్రమంలో వీలైనంత తొందరగా చేపడతామని అన్నారు. ఆయన వెంట సిఆర్‌డిఎ కమిషనరు వివేక్‌యాదవ్‌, సిఇ ధనుంజయ తదితరులు ఉన్నారు.

➡️