విభజన తరువాత రాష్ట్రం వెనుకబాటు

  • శాసనమండలి ఛైర్మన్‌ మోషేను రాజు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర విభజన తరువాత నుంచి అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడిపోయిందని, పరిశ్రమలన్నీ హైదరాబాద్‌లో ఉండిపోయాయని శాసనమండలి ఛైర్మన్‌ మోషేను రాజు పేర్కొన్నారు. లోక్‌సభ స్పీకరు ఓం బిర్లా నేతృత్వంలో ఢిల్లీలో రెండు రోజులపాటు కామన్‌ వెల్త్‌ పార్లమెంటరీ అసోసియేషన్‌ రీజియన్‌ సదస్సుకు మోషేను రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సదస్సులో సమగ్ర అభివృద్ధి, కేంద్రం తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం వంటి అంశాలపై చర్చ జరిగిందన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని పేర్కొన్నారు. సిఎం చంద్రబాబు ఎన్‌డిఎలో ఉన్నారని, కావున రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నారు. గత పదేళ్లుగా రాజధాని లేకపోవడంతో కొంచెం అభివృద్ధికి ఆటంకం కలిగిందని పేర్కొన్నారు. సభాపతులు, శాసనమండలి ఛైర్మన్లకు బడ్జెట్‌ ఖర్చు పెట్టే అధికారాలు ఉండాలన్నారు. సమావేశంలో కూడా అందరూ ఇదే అంశాన్ని లేవనెత్తారన్నారు. శాసనసభ, శాసనమండలి 60 రోజులపాటు జరగాలని సమావేశంలో చర్చించామన్నారు. రాష్టానికి రావాల్సిన నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన ఆయన.. సిబిఐ విచారణ కోరుతున్నానని అన్నారు.

➡️