- లేబర్ కోడ్‌ల పేరుతో కేంద్రం అరాచకం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా మే 20న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఈ నెల 25న విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు. సమ్మెకు సన్నాహకంగా మంగళవారం విజయవాడ బాలోత్సవ భవన్లో కార్మిక సంఘాల సమావేశం కన్వీనర్ వి ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. దీనికి సిఐటియు నుండి రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, నాయకులు ఎన్‌సిహెచ్ శ్రీనివాసరావు, ఎ వెంకటేశ్వరరావు, ఎఐటియుసి తరపున అధ్యక్షులు రావులపల్లి రవీంద్ర, వెంకట సుబ్బయ్య, రాధాకృష్ణమూర్తి, వైఎస్‌ఆర్‌టియుసి తరపున అధ్యక్షులు గౌతంరెడ్డి, ఐఎఫ్‌టియు తరపున ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ఎఐఎఫ్‌టియు తరపున జాస్తి కిషోర్, లక్ష్మణరావు, ఎఐయుటియుసి తరపున సుధీర్‌బాబు, టియుసిసి నాయకులు మరీదు ప్రసాద్‌బాబు, సంయుక్త కిసాన్ మోర్చా తరపున సీనియర్ నాయకులు వై కేశవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వారు వివరించారు. కన్వీనర్ వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. లేబర్‌కోడ్‌ల పేరుతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాయడంతోపాటు వారిని బానిసలుగా మారుస్తోందని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు వీలుగా చట్టాలను మారుస్తున్నారని అన్నారు. దేశాన్ని ఆర్థికంగా నిర్మించే కార్మికుల పట్ల కేంద్రం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందన్నారు. రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. దేశంలో కార్మికరంగం మొత్తం వద్దని చెబుతున్నా లేబర్‌కోడ్‌లను అమల్లోకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోడ్‌ల వల్ల కార్మికులు కట్టుబానిసలుగా మారతారని, కార్పొరేట్ దోపిడీని ప్రశ్నించే హక్కును కోల్పోతారని అన్నారు. గౌతంరెడ్డి మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్‌కోడ్‌లు చట్టపరంగా అన్యాయమైనవని పేర్కొన్నారు. వీటిపై ప్రత్యక్షంగా పోరాటం నిర్వహించాలని తెలిపారు. జాస్తి కిషోర్ మాట్లాడుతూ.. సమ్మెకు అన్ని సంఘాల మద్దతు తీసుకుని విజయవంతం చేయాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున నిర్ణయం తీసుకున్నామని అన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్రం అనుసరిస్తున్న నియంతృత్వ విధానాలను అడ్డుకోవాలన్నారు. సుధీర్‌బాబు, మరీదు ప్రసాద్‌బాబు, వై కేశవరావు తదితరులు మాట్లాడారు. 25న జరిగే రాష్ట్ర సదస్సులో సమ్మె సన్నాహక కార్యక్రమాన్ని నిర్ణయిస్తామని తెలిపారు. దీనికి అన్ని జిల్లాల నుండి కార్మిక సంఘాల నాయకులు హాజరవుతారని అన్నారు. లేబర్‌కోడ్‌లపై ప్రజలకు వివరించి ఆందోళనలో వారిని భాగస్వాములను చేయాలని నిర్ణయించారు.