- శాన్ ఫ్రాన్సిస్కో పారిశ్రామికవేత్తలతో లోకేష్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ) అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబో తోందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల తేవాలనే లక్ష్యంతో ఆయన నవంబర్ ఒకటవ తేది వరకు అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తొలిరోజైన శనివారం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో పర్యటించి అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమైన లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను వివరించారు. భారత్‌లో రాబోయే పాతికేళ్లల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకోబోతున్నా యని తెలిపారు. పరిపాలనలో ఎఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించేందుకు తాము కృషిచేస్తున్నట్లు చెప్పారు. విభజిత రాష్ట్రంలో మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనకు ముఖ్యమంత్రి సరికొత్త పి-4 విధానానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతతో కూడిన మానవవనరులను అందిచండం ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విద్యారంగంలో సంస్కరణలు తెస్తున్నట్లు తెలిపారు. నవీన ఆవిష్కరణల కోసం విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ రీసెర్చి సెంట్రిక్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కార్తీకేయ మిశ్రా, పారిశ్రామికవేత్తలు ప్రవీణ్ అక్కిరాజు, రామ అక్కిరాజు, విప్రో ప్రెసిడెంట్ నాగేంద్ర బండారు తదితరులు పాల్గొన్నారు. అమెరికాకు చేరుకున్న లోకేష్‌కు అంతకుముందు అక్కడి తెలుగు ప్రముఖు లు, టిడిపి అభిమానులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎన్‌ఆర్‌ఐ యుఎస్‌ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి తదితరులు ఉన్నారు.