ప్రజాశక్తి – యంత్రాంగం : ప్రజా వ్యతిరేక బడ్జెట్‌ను నిరసిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధవారం నిరసనలు తెలిపి బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఒంగోలులో అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి చర్చి సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. విభజన హామీలను అమలు చేయాలని, ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని, వెనుకబడిన ప్రకాశం జిల్లాకు పదివేల కోట్లు నిధులు మంజూరు చేయాలని రైతు , కార్మిక, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ.. కార్మిక హక్కులను కాలరాసే దగాకోరు బడ్జెట్ అని విమర్శించారు. బాపట్లలో నిరసన తెలిపారు. ఏలూరులో వసంత మహల్ సెంటర్‌లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. చింతలపూడిలో, జీలుగుమిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో నిరసన తెలిపి బడ్జెట్ ప్రతులు దగ్ధం చేశారు. ఎన్‌టిఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ కార్యాలయం, వత్సవాయి గాంధీ బొమ్మ సెంటర్, మైలవరంలోని నూజివీడు రోడ్డు జెండా చెట్టు సెంటర్లలో ఆందోళన తెలిపారు. విశాఖ జిల్లాలోని తగరపువలస జంక్షన్‌లోనూ, అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలోనూ నిరసనలు తెలిపారు. బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆండ్ర మాల్యాద్రి పాల్గొన్నారు. బలరాం మాట్లాడుతూ… బడ్జెట్‌లో ఎపికి మళ్లీ మొండి చేయి చూపిందని విమర్శించారు.
రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల ఎంపిలు కేంద్రాన్ని నిలదీయాలన్నారు. కాకినాడ జిల్లా కరప, తాళ్లరేవులో బడ్జెట్ పత్రాలను దహనం చేశారు.










