‘డిఎస్‌సి’ విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

  • డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న

ప్రజాశక్తి-కడప అర్బన్‌ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టిడిపి కూటమి ప్రభుత్వం వెంటనే డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న డిమాండ్‌ చేశారు. డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతూ డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు గురువారం కడప జిల్లా పరిషత్‌ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఖాళీ ప్లేట్లతో నిరసన వ్యక్తం చేసి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని డిఎస్‌సి నోటిఫికేషన్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి సంతకం చేశారని, కానీ నేటికీ నోటిఫికేషన్‌ విడుదల కాలేదని తెలిపారు. డిఎస్‌సి విడుదలలో కాలయాపన చేస్తూ టిడిపి కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. నోటిఫికేషన్‌ లేక లక్షలాది మంది నిరుద్యోగులు లక్షలాది రూపాయలు వెచ్చించి కోచింగ్‌ తీసుకుంటున్నారని తెలిపారు. వెనుకబడిన రాయలసీమ లాంటి ప్రాంతంలో ఉద్యోగాలు రాక వలస బాట పడుతున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే డిఎస్‌సి నోటిఫికేషన్‌ విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరణాల శివకుమార్‌, నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.

➡️