- 10 నుంచి 30 వరకు దళితవాడల్లో సర్వే
- ఎపి వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి – ఏలూరు : దళిత సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు తెలిపారు. దళితుల సమస్యలపై ఈ నెల పది నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా దళితవాడల్లో సర్వే చేపట్టనున్నామని చెప్పారు. ఆ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం స్థానిక ఉద్దరాజు రామం భవనంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా దళితుల సమస్యలపై విస్తృతంగా చర్చించామని, దీనిపై వెంటనే ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దళితులపై దాడులు, అత్యాచారాలు, వివక్ష, అంటరానితనంపై రాష్ట్రవ్యాప్తంగా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఉద్యమం చేపడుతున్నట్లు వివరించారు. అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దళితులను, ప్రజలను అవమానపరిచినట్లుగా ఉన్నాయన్నారు. బిజెపి మతోన్మాద చర్యలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో అన్ని ప్రజాసంఘాలు ఈ ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల కోసం రానున్న కాలంలో ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు, పర్యటనలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. భూమి, ఉపాధి హామీ, దళిత, గిరిజనుల సమస్యలపై రానున్న మూడు నెలల్లో ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం కోసం ఒక ప్రణాళికను తయారుచేసి ప్రజల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. లౌకికతత్వాన్ని కాపాడడానికి జరిగే ఉద్యమంలో ప్రజాస్వామ్యవాదులంతా కలిసి రావాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా నాయకులు ఎ.రవి, తామా ముత్యాలమ్మ, పి.రామకృష్ణ, ఎస్.మహంకాళిరావు తదితరులు పాల్గొన్నారు.