- సమ్మె హామీల అమలు కోసం అంగన్‌వాడీ సంఘాల ఆందోళన
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత ఏడాది 42 రోజులపాటు సమ్మె చేపట్టిన అంగన్‌వాడీలకు చర్చల్లో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అంగన్‌వాడీ సంఘాలు డిమాండ్ చేశాయి. సమ్మె ప్రారంభించి డిసెంబర్ 12 నాటికి ఏడాది అవుతున్న సందర్భంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చాయి. శుక్రవారం ఉదయం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, నాయకులు ఎన్‌సిహెచ్ సుప్రజ, గజలక్ష్మి, ఉమాదేవి, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ (ఎఐటియుసి) రాష్ట్ర కార్యదర్శి లలితమ్మ, ప్రేమ, ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌్ అండ్ హెల్పర్స్ యూనియన్ (ఐఎఫ్‌టియు) కార్యదర్శి విఆర్ జ్యోతి, భారతి, పద్మ పాల్గొని మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు అనేక సేవలు అందిస్తున్న అంగన్‌వాడీలపై రకరకాల యాప్‌ల పేరుతో విపరీతమైన పనిభారం పెంచారని తెలిపారు. ఫోన్లు పనిచేయడం లేదని, సెంటర్ నిర్వహణకు ఇవ్వాల్సిన బిల్లులు, అద్దెలు నెలనెలా చెల్లించడం లేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా అంగన్‌వాడీలకు వేతనాలు పెరగలేదని తెలిపారు. సెంటర్ నిర్వహణకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని, దీంతో అప్పుల పాలవుతున్నారని పేర్కొన్నారు. 2023 డిసెంబర్ 12 నుండి 2024 జనవరి 22 వరకూ 42 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు సమ్మెకు దిగారని వివరించారు. అంతకముందు జులై నెలలో చర్చలకు పిలిచి వేతనాలు పెంచుతామని తెలిపారని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని మినిట్స్ కాపీ కూడా ఇచ్చారని తెలిపారు. వీటిని అమలు చేయాలని కూటమి ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పరిష్కరించలేదన్నారు. సమ్మె ప్రారంభించి డిసెంబర్ 12 నాటికి ఏడాది అవుతుందని, ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఒప్పంద సమయంలో అంగీకరించిన హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జిఓ ఇవ్వాలన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారి దహన సంస్కారాలకు రూ.20 వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సమ్మెకాలంలో చనిపోయిన వారికి కూడా అమలు చేయాలని కోరారు. ప్రీ స్కూల్‌ను బలోపేతం చేయాలని, పిల్లలకూ తల్లికి వందనం అమలు చేయాలని, ఐదేళ్ల వరకూ పిల్లలు అంగన్‌వాడీ సెంటర్లలో ఉండేలా జిఓ ఇవ్వాలని కోరారు. వారికి సాయంత్రం స్నాక్స్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని, సమ్మెకాలంలో పెట్టిన కేసులు ఎత్తేయాలని కోరారు. ఒకే యాప్ అమలు చేయాలని, ఇకెవైసి, చిన్న పిల్లలకు ఫేస్ యాప్ రద్దు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్‌వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు రెగ్యులర్‌గా సరఫరా చేయాలని, మెనూ, మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. వేతనంతో కూడిన మెడికల్ లీవు మూడు నెలలు ఇవ్వాలని, సెంటర్లకు ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీ యూనియన్లతో జాయింట్ మీటింగు ఏర్పాటు చేయాలని వారు కోరారు.