రాష్ట్రానికి అండగా నిలవండి

  • డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలి
  • రాజ్‌నాథ్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్‌ భేటీ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అండగా నిలవాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ కోరారు. అలాగే రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం నాడిక్కడ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, కుమారస్వామితో ఆయన భేటీ అయ్యారు. తొలుత కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని లోకేష్‌ కోరారు. డిఫెన్స్‌ రంగం పరికరాల తయారీలో కొన్ని యూనిట్లు ఎపికి వచ్చేలా సహకరించాలన్నారు. రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసిన మంత్రి నారా లోకేష్‌.. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించబోయే అఖిల భారత విద్యాశాఖ మంత్రుల సమ్మేళనాన్ని ఎపిలో ఏర్పాటు చేసే అవకాశం కల్పించాలని కోరారు. విద్యా రంగ అభివృద్ధి కోసం కేంద్రం రాష్ట్రానికి నిధుల కేటాయింపులు పెంచాలని కోరారు. అలాగే పిఎం శ్రీ పథకం ఫేజ్‌ -1, 2లలో కలిపి ఎపిలో ప్రతిపాదించిన 2,369 పాఠశాలలకు గానూ 855 మాత్రమే మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన 1,514 పాఠశాలలను ఫేజ్‌-3లో మంజూరు చేయాలని కోరారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి పూర్వోదయ పథకం కింద మొత్తంగా రూ.5,684 కోట్లు మంజూరు చేయాల్సిందిగా లోకేష్‌ కోరారు.

మిట్టల్‌ స్టీల్‌ప్లాంట్‌ త్వరితగతిన అనుమతులు

విశాఖ ఉక్కుకు నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డి కుమారస్వామికి మంత్రి లోకేష్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆయనతో సమావేశం సందర్భంగా అనకాపల్లి వద్ద ప్రైవేటు రంగంలో ఏర్పాటు కానున్న ఆర్సెలర్స్‌ మిట్టల్‌ నిప్పాన్‌ స్టీల్స్‌ ఉక్కు పరిశ్రమ వల్ల ఎపి యువతకు పెద్దయెత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని, ఈ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం తరపున అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కుమారస్వామిని లోకేష్‌ కోరారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మాజీ ప్రధాని దేవగౌడను కూడా లోకేష్‌ కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

గూగుల్‌ క్లౌడ్‌ ఎమ్‌డి బిక్రమ్‌ సింగ్‌, కంట్రీ డైరెక్టర్‌ (పబ్లిక్‌ సెక్టార్‌ అండ్‌ ఎడ్‌ టెక్‌) ఆశిష్‌, వారి బృందాన్ని మంత్రి నారా లోకేష్‌ కలిశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ప్రతిపాదిత డేటా సిటీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ఇరువురు చర్చించారు.

రాష్ట్రంలోని క్యాడెట్లకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు సహకారం అందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను లోకేష్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు ఎన్‌సిసి గ్రూపులు, 43 యూనిట్ల పరిధిలో 75 వేలమందికి పైగా క్యాడెట్లు ఉన్నారని, అమరావతిలో ప్రత్యేకంగా ఎన్‌సిసి డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

➡️