‘ఉక్కు’పై మౌనం తగదు

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై తెలుగు రాష్ట్రాల ఎంపీలు మౌనం వహించడం తగదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో – కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 1394వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు, కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ ఈ నెల 3న పార్లమెంట్‌ సాక్షిగా ఎంపి కీర్తి ఆజాద్‌ విశాఖ ఉక్కు కర్మాగారంపై వేసిన ప్రశ్నకు రాతపూర్వకంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డి.కుమారస్వామి సమాధానమిచ్చారని, దానిలో ప్రయివేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ఇంత జరుగుతున్నా తెలుగు రాష్ట్రాల ఎంపీలు మౌనం దాల్చడం ఎంత మాత్రమూ తగదన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, కార్మికులు చేస్తోన్న ఉద్యమాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జులై 11న ఉక్కు శాఖ మంత్రి ప్లాంట్‌కు విచ్చేసి కర్మాగారం పరిరక్షణపై చేసిన ప్రకటన నీటి మీద రాతలేనా ? అని ప్రశ్నించారు. శాసన మండలిలో ఉక్కుపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రులు చేసిన ప్రసంగాలపై నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితి నేడు నెలకొందన్నారు. ప్రస్తుతం సిఎం చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉన్నందున తక్షణమే ఉక్కుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టే విధంగా ఒత్తిడి చేయాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైటి.దాస్‌, యు.రామస్వామి మాట్లాడుతూ కార్మికుల పట్ల నిరంకుశ విధానాలు తగవన్నారు. పిఎఫ్‌, ఎస్‌ఎబిఎఫ్‌, జీతాలు, త్రిప్ట్‌కు ఇవ్వాల్సిన రూ.1033 కోట్లను చెల్లించకుండా యాజమాన్యం దారుణంగా వ్యవహరిస్తోందన్నారు. తక్షణమే ఆ వైఖరిని మార్చుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శ్రీనివాసరాజు, బి.అప్పారావు, టివికె.రాజు, కె.గంగాధర్‌, మరిడయ్య, దుర్గాప్రసాద్‌, ఎ.శ్రీనివాస్‌, విడివి.పూర్ణచంద్రరావు, సూర్యనారాయణ, వేణు, పి.రామారావు, యు.వెంకటేశ్వర్లు, డిసిహెచ్‌.వెంకటేశ్వరరావు పాల్గన్నారు.

➡️