ప్రజాశక్తి – గాజువాక (విశాఖపట్నం) : స్టీల్‌ప్లాంట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యాన పాత గాజువాక జంక్షన్‌లో ఆదివారం మహా ధర్నా జరిగింది. పెద్ద ఎత్తున కాంట్రాక్టు కార్మికులు తరలివచ్చారు. వారి ఆందోళనకు రాజకీయ పార్టీలు, ఉక్కు కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ప్లాంట్‌లో కాంట్రాక్టు కార్మికుల అక్రమ తొలగింపులను ఆపకుంటే నిరవధిక సమ్మెకు దిగక తప్పదని కాంట్రాక్టు కార్మికులు హెచ్చరించారు. కాంట్రాక్టు కార్మికులను ఎవ్వరినీ తొలగించొద్దని ఇప్పటి వరకూ తొలగించిన వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని, ఇఎస్‌ఐ లేని కార్మికులకు స్టీల్ యాజమాన్యమే వైద్య సౌకర్యం కల్పించాలని, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని పెద్దపెట్టున నినదించారు. స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్టు లేబర్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు జి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌లో అక్రమ తొలగింపులను ఆపాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఇప్పటికీ ప్లాంట్‌లో ఉద్యోగాలు రాని నిర్వాసితులు 8500 మంది, భర్తీ చేయాల్సిన ఉద్యోగ ఖాళీలు 5 వేల వరకు ఉన్నాయని తెలిపారు. ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 4.3 నుండి 7.3 మిలియన్ టన్నులకు చేరిందని, భవిష్యత్తులో 20 వేల మిలియన్ టన్నుల వరకు విస్తరణకు అవకాశముందని వివరించారు. ఈ నేపథ్యంలో కార్మికులను పెంచాల్సిందిపోయి విఆర్‌ఎస్ పేరుతో పర్మినెంట్ కార్మికులను, బలవంతంగా కాంటాక్ట్ కార్మికులను తొలగించడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కెఎం.శ్రీనివాస్, ఎన్.రామారావు, ఉక్కు కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు నమ్మి రమణ, మంత్రి రవి, కె.వంశీ, ఉరుకూటి అప్పారావు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరాం, డి.ఆదినారాయణ, ఎం రాజశేఖర్, యు.రామస్వామి, వైసిపి గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్‌రెడ్డి, సిపిఐ నాయకులు కె.సత్యనారాయణ, టిడిపి నాయకులు పులి రమణారెడ్డి పాల్గన్నారు.
