ఉక్కు ఊసే లేదు!

  • రాష్ట్ర ప్రజల మనోభావాలు పట్టని ప్రధాని శ్రీ సంపన్న ఎపి లక్ష్యమంటూ ప్రకటన’
  • పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, పారంభోత్సవం
  • విశాఖ స్టీలు గురించి పెదవి విప్పని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌
  • మిట్టల్‌ స్టీల్‌ గురించి మాట్లాడిన సిఎం

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలను నిర్లక్ష్యం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం నాలుగేళ్లుగా ఆందోళన సాగుతున్న విశాఖపట్నం పర్యటనకు బుధవారం వచ్చిన ఆయన విశాఖ ఉక్కు గురించి నామమాత్రంగా కూడా స్పందించలేదు. విశాఖ ఉక్కు కార్మికులను, సిపిఎంతో పాటు వామపక్షాల నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధించిన రాష్ట్ర ప్రభుత్వం పర్యటనలోనూ, సభలోనూ నిరసన గళం ప్రధానికి వినిపించకుండా జాగ్రత్తపడింది. దీంతో విస్తృత ప్రజా మద్దతుతో సుదీర్ఘకాలంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతున్న విషయం అసలు తెలియనట్లుగానే ప్రధాని మోడీ వ్యవహరించారు. విశాఖ ఉక్కుతో పాటు, రాష్ట్రాభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధుల విషయాలను ఆయన అసలు ప్రస్తావించనే లేదు. ప్రధానితో పాటు రోడ్‌షోలోనూ, బహిరంగ సభలోనూ పాల్గొని, ప్రసంగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కూడా విశాఖ ఉక్కుతో పాటు, ఇతర అంశాలపై పెదవి విప్పకపోవడం గమనార్హం. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడ మిట్టల్‌ స్టీల్‌ విషయాన్ని మాత్రం ప్రధాని సమక్షంలో ప్రస్తావించారు. తనదైన శైలిలో సుదీర్ఘంగా మాట్లాడిన ప్రధాని సుసంపన్న ఎపి తమ లక్ష్యమని ప్రకటించారు. విశాఖలోని ఎయు ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో టిడిపి కూటమి పార్టీల ఆధ్వర్యాన బుధవారం సాయంత్రం జరిగిన ‘ప్రజావేదిక’ సభలో తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన ప్రధాని మోడీ ‘విశాఖలో మీ స్వాగతం చూశాను. ఆంధ్రా ప్రజల ప్రేమ, అభిమానం చూశాను. సేవ చేయడం ద్వారా నా అభిమానాన్ని చూపిస్తాను’ అని అన్నారు. ‘రాష్ట్రాభివృద్ధికి ప్రాజెక్టులు కీలకం. సుసంపన్న ఎపియే ఎన్‌డిఎ లక్ష్యం’ అని ప్రకటించారు. విశాఖలో పది ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ముందుకొచ్చినట్లు చెప్పారు. పూడిమడకలో రూ1.85 లక్షల కోట్లతో తలపెట్టిన ఎన్‌టిపిసి గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ అత్యంత కీలకమైనదని, దీనికి పునాదిరాయి వేయడం ద్వారా 70 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు వస్తు తయారీ రంగం, ఫార్మా రంగ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయానికి కూడా శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్ర అభివృద్ధిలో సరికొత్త శిఖరాలుగా నిలుస్తాయన్నారు.

మోడీ గ్లోబల్‌ లీడర్‌ :సిఎం చంద్రబాబు

ఈ దేశమే కాదు.. ప్రపంచం మెచ్చిన ‘గ్లోబల్‌ లీడర్‌’ మోడీ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధానిని పొగడ్తలతో ముంచెత్తారు. ఒకే రోజున రూ.2.85 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభాలు చేయడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ఎన్‌డిఎ కాంబినేషన్‌ భవిష్యత్‌లోనూ కొనసాగుతుందని చెప్పారు. గత ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్‌కు స్థలం కూడా చూపించలేదన్నారు. విశాఖ ఉక్కు గురించి పెదవి విప్పని చంద్రబాబు అదే సమయంలో ఆర్సెలార్‌ మిట్టల్‌ ప్లాంట్‌ గురించి మాట్లాడారు. మిట్టల్‌ ప్లాంటు గురించి ఢిల్లీ వెళ్లి వివరించానని, మిట్టల్‌కు ఐరన్‌ ఓర్‌ను మామూలుగా సరఫరా చేస్తే పర్యావరణ సమస్య ఉంటుందని, పైప్‌లైన్‌ ద్వారా చేయాలని తాను కోరగా వెంటనే ప్రధాని సరేనన్నారని ఆయన చెప్పారు. ‘ఇంతకంటే విశాఖ ప్రజలకు ఇంకేం కావాలి.’ అని ఆయన అన్నారు. జనసేన అధినేత, డిప్యూటీ సిఎం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ఎపిని పుష్కలమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు టిడిపి కూటమి పార్టీలు కృషి చేస్తున్నాయన్నారు. ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కొనసాగింపు అనేది అభివృద్ధికి మూలమని, మూడు పర్యాయాలు మోడీ గెలిచినందునే దేశం అభివృద్ధిలో ప్రపంచంలో దూసుకెళ్తోందని అన్నారు. ప్రజావేదిక సభలో తొలుత అనకాపల్లి ఎంపి సిఎం రమేష్‌ స్వాగతోపన్యాసం చేశారు. పధాని హిందీ ప్రసంగాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహనాయుడు తెలుగులోకి అనువదించారు.

ఘన స్వాగతం

విశాఖ పర్యటనలో భాగంగా ప్రధాని తొలుత ప్రత్యేక విమానంలో ఐఎన్‌ఎస్‌ డేగకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం 4.50 గంటలకు సిరిపురం వద్దగల వెంకటాద్రి వంటిల్లు నుంచి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో మోడీ రోడ్డు షో నిర్వహించారు. ఆయన పక్కన చంద్రబాబు, పవన్‌, పురంధరేశ్వరి ఉన్నారు.

 వర్చువల్‌గా చేపట్టిన ప్రాజెక్టులివే..

అనకాపల్లి జిల్లా నక్కపల్లి బల్క్‌ డ్రగ్‌ పార్కుకు రూ.1876 కోట్లతో, పూడిమడకలో ఎన్‌టిపిసి గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టును రూ.1.85 లక్షల కోట్లతో మోడీ వక్చువల్‌గా శంకుస్థాపన చేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయానికి రూ.149 కోట్లతో పునాది రాయి వేశారు. రూ.2,139 కోట్లతో కృష్ణపట్నం పారిశ్రామిక పార్క్‌కు, రూ.4593 కోట్లతో 10 ప్రాజెక్టులకు సంబంధించిన రోడ్ల కనెక్టివిటీ, విస్తరణ పనులకు, 6028 కోట్లతో 6 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. రూ.3,044 కోట్లతో నిర్మించిన 234.28 కిలోమీటర్ల రోడ్లను, 323 కిలోమీటర్ల మేర వేసిన రైల్వే లైన్లను ప్రారంభించి జాతికి అంకితం చేశారు.

➡️