హెచ్‌ఆర్‌ఎ రద్దు, విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. స్టీల్‌ ఇడి భవనం ముట్టడి

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :  హెచ్‌ఆర్‌ఎ రద్దు, విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ స్టీల్‌ప్లాంట్‌ ఇడి బిల్డింగ్‌ను శనివారం ఉక్కు ఉద్యోగులు ముట్టడించారు. తమకు తక్షణమే హెచ్‌ఆర్‌ఎ ఇవ్వాలని, తమ క్వార్టర్స్‌లో పెంచిన కరెంట్‌ బిల్లులను తగ్గించాలని నినదించారు. ముట్టడి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కార్మికులు, వారి కుటుంబసభ్యులు తరలివచ్చారు. ఈ క్రమంలో సాయంత్రం స్టీల్‌ సిజిఎం హెచ్‌ఆర్‌ మధుసూదన్‌ ఉక్కు కార్మిక సంఘాల నేతలతో మాట్లాడారు. హెచ్‌ఆర్‌ఎ, విద్యుత్‌ ఛార్జీలు వంటి అంశాలు స్టీల్‌ ప్లాంట్‌ ఉన్నత యాజమాన్యం నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని, సిఎమ్‌డితో మాట్లాడుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. దీంతో కార్మికులు రాత్రి వరకూ ఆందోళనను కొనసాగించారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ.. స్టీల్‌ టౌన్‌షిప్‌ చుట్టు పక్కల ప్రాంతాల వారికి యూనిట్‌కు రూ.నాలుగు నుంచి ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేసి స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో మాత్రం యూనిట్‌కు ఎనిమిది రూపాయలు వసూలు చేస్తామనడం సమంజసం కాదన్నారు. ఈ నెల 22న ఇదే అంశంపై కోర్టు వాయిదా ఉందని తెలిపారు. ఆ వాయిదా పూర్తయ్యేంత వరకూ విద్యుత్‌ సరఫరా నిలిపివేయకుండా ఉండాలని కోరినప్పటికీ యాజమాన్యం మాట వినిపించుకోవడం లేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రివైజ్డ్‌ బేసిక్‌పై 20 శాతం హెచ్‌ఆర్‌ఎను సాధించుకున్న ఘనత విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులకు మాత్రమే దక్కుతుందని, దానిని కూడా తొలగించాలని యాజమాన్యం చూస్తోందని తెలిపారు. ఆ నిర్ణయాన్ని పోరాటాలతో తిప్పికొడతామన్నారు. కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌, ఎఐటియుసి నాయకులు డి.ఆదినారాయణ, కెఎస్‌ఎన్‌.రావు, ఐఎన్‌టియుసి నాయకులు మంత్రి రాజశేఖర్‌, డివిఆర్‌ ఎస్‌ఇయు యూనియన్‌ నాయకులు డివి.రమణారెడ్డి, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

➡️