- విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చిత్తశుద్ధితో పోరాడాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, శ్రీనివాస నాయుడు, ప్రసాద్, మహాలక్ష్మి నాయడు, పరంధామయ్య అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారానికి 1323వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ జెఎంఎస్, డిఐటియు, విఎస్‌ఇయు, యూజ్, విఎస్‌పిఇయు, విఎస్‌ఎంఎస్ సంఘాల కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ లాభాల్లో ఉన్న ప్లాంట్‌ను కావాలనే రూ.5000 కోట్ల నష్టాల్లోకి నెట్టారన్నారు. ప్లాంట్‌ను కాపాడుతామని మాయమాటలు చెబుతూ నిర్వీర్యం చేసే దిశగా చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా టిడిపి కూటమి సర్కారు అలసత్వం వీడి రాష్ట్ర ప్రజల మద్దతుతో మోడీ సర్కారుపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని, వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చాలని కోరారు. ప్లాంట్‌లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని, సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామ్‌కుమార్, శ్రీనివాసరావు, డేవిడ్, సుధీర్ రాజు, జె.రామకృష్ణ, విల్లా రామ్మోహన్ కుమార్, గుమ్మడి నరేంద్ర పాల్గొన్నారు.