ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : బకాయి వేతనాలు చెల్లించాలని, ఆస్పత్రి, క్యాంటీన్ సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని స్టీల్‌ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన ఉక్కు కార్మికులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ కార్మికులకు గడిచిన మూడు నెలలుగా బకాయి పడ్డ 185 శాతం వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో తన వైఖరిని మార్చుకోకున్నా తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రశ్నించకపోవడం దుర్మార్గమన్నారు. టిడిపి, జనసేన మద్దతుతోనే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉందని, ఇప్పుడు ఆ పార్టీని చంద్రబాబు, పవన్‌లు ప్రశ్నించకుంటే రాష్ట్ర ప్రజల దృష్టిలో ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. కేంద్రం సాయం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తోందని, దానిలో ఒక్కపైసా కూడా స్టీల్‌ప్లాంట్ వినియోగించుకోలేదని స్పష్టం చేశారు. ఆ మొత్తాన్ని బ్యాంకులకు, ప్రభుత్వానికి చెల్లించిన విషయం నాయకులకు తెలియదా? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తి చేయడానికి అవసరమైన చర్యలను కేంద్రం తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఫిబ్రవరి నుంచి కార్మికుల వేతనాలపై ఆంక్షలు విధిస్తూ వారిని మనోవేదనకు గురిచేస్తోందని తెలిపారు. కార్మికుల సంక్షేమం నుంచి ప్లాంట్ యాజమాన్యం పక్కకు తప్పుకుంటోందన్నారు. సంఘం అధ్యక్షులు వైటి.దాస్ మాట్లాడుతూ అత్యంత ప్రమాదకర ప్రదేశాల మధ్య పని చేస్తున్న కార్మికులకు అందించాల్సిన వైద్యం విషయంలో యాజమాన్యం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ధర్నాలో సంఘం నాయకులు కె.గంగాధర్, కృష్ణమూర్తి, మరిడయ్య, బి.అప్పారావు, శ్రీనివాసరాజు, వి.ప్రసాద్, మహేష్, తౌడన్న, శ్రీనివాస్, ఎంవి.రమణ, కె.భానుమూర్తి, సత్యనారాయణ, పూర్ణచంద్రరావు, ప్లాంట్‌లోని వివిధ విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
