బకాయిలు చెల్లించాలని ఉక్కు కార్మికుల ధర్నా

Jan 11,2025 21:02 #Dues, #Payment, #steel workers, #strike
  • పళ్లాలు మోగిస్తూ నిరసన

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు యాజమాన్యం కార్మికులకు బకాయిపడ్డ నాలుగు నెలల జీతాలను తక్షణమే చెల్లించాలంటూ స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన శనివారం ధర్నా చేపట్టారు. ఉక్కు కార్మికులు స్టీల్‌ పళ్లాలు మోగిస్తూ తమ నిరసన తెలియజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలని, ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేయొద్దని 1429 రోజులుగా స్టీల్‌ కార్మికులు పోరాడుతున్నారని, వారికి జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు. ఉక్కు యాజమాన్యం కార్మికులకు చెల్లించాల్సిన పిఎఫ్‌ మొత్తం రూ.500 కోట్లు, త్రిప్ట్‌ మొత్తం రూ.80 కోట్లు, పెన్షన్‌ రూ.100 కోట్లు చెల్లించకుండా నిరాశకు గురిచేస్తుందని తెలిపారు. ఈ విషయాలను కార్మికులకు వివరించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ కార్మికులకు జీతాలు చెల్లించకుండా యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికుల శ్రమను, వారి బాధలను గుర్తించి తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సంఘం అధ్యక్షులు వైటి.దాస్‌ మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు లేవని, కానీ.. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేస్తామంటున్న ఆర్సిలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌కు మాత్రం గనులు కేటాయించాలంటూ రాష్ట్ర పాలకులు కేంద్రాన్ని అడగటం దారుణమన్నారు. ప్రయివేట్‌ ప్లాంట్‌పై ఎందుకింత ప్రేమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పి.శ్రీనివాసరాజు, కె.గంగాధర్‌, టివికె.రాజు, మరిడయ్య, వి.ప్రసాద్‌, పుల్లారావు, నీలకంఠం, కెవి.సత్యనారాయణ, డిసిహెచ్‌.వెంకటేశ్వరరావు, పి.రమేష్‌, రాజేశ్వరరావు, రమణమూర్తి, డిఎస్‌ఆర్‌సి.మూర్తి, కె.సత్యనారాయణ, బిఎన్‌.మధుసూదన్‌ పాల్గొన్నారు.

➡️