- స్టీల్‌ప్లాంట్ ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయీస్ అసోసియేషన్
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పోరాటాలతో కాపాడుకుని భావితరాలకు అందిస్తామని స్టీల్‌ప్లాంట్ ఎస్‌సి, ఎస్‌టి ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు బొండా తౌడన్న, బి.మల్లయ్య, ఎస్.సత్యనారాయణ అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 1466వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌లోని పలు విభాగాల కార్మికులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలపైనా, రాజ్యాంగంపైనా దాడులు చేస్తోందన్నారు. వాటి నిర్వీర్యానికి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థగా ఉండబట్టే ఎంతోమంది బడుగు, బలహీన తరగతుల వారికి రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయని తెలిపారు. అదే ప్రయివేటుపరమైతే రిజర్వేషన్లు అమలు కావన్నారు. ఈ నేపథ్యంలో అందరూ ప్లాంట్ పరిరక్షణ కోసం పాటుపడాలని కోరారు.