- జూన్ రెండో వారంలో నిరవధిక సమ్మె
- పిడిఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : విఆర్‌ఎల సమస్యల పరిష్కారానికి దశల వారీ పోరాటం చేయాలని, నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, పే స్కేల్ జీతాలు, ప్రమోషన్స్ కల్పించాలని, డిఎను జీతంలో కలపడంతోపాటు మిగిలిన సమస్యలను మే నెలాఖరులోగా పరిష్కరించాలని విఆర్‌ఎల రాష్ట్ర సదస్సు తీర్మానించింది. లేనిపక్షంలో జూన్ రెండో వారంలో నిరవధిక సమ్మెకు దిగాలని కూడా సదస్సు నిర్ణయించింది. విజయవాడ బందరురోడ్డులోని ఎంబివికెలో శనివారం ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (విఆర్‌ఎ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ బందగి సాహెబ్ అధ్యక్షతన సదస్సు జరిగింది. ఈ సదస్సు పలు తీర్మాణాలు చేసింది. నామినీలను విఆర్‌ఎలుగా గుర్తించాలనే డిమాండ్ల సాధన కోసం ఈ నెల 6, 7 తేదీల్లో తహశీల్దారుకు, 8, 9 తేదీల్లో ఆర్‌డిఒలకు, 10, 11, 12 తేదీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులకు, 15, 16 తేదీల్లో కలెక్టర్లకు రాయభారాలు, ఏప్రిల్ 28, 29 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో దీక్షలు, 30న కలెక్టర్లకు సామూహిక రాయభారం, మే నెల 13, 14 తేదీల్లో రాష్ట్ర కేంద్రంలో రిలే దీక్షలు నిర్వహించాలని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. విఆర్‌ఎలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి టిడిపి కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కేవలం రూ.10,500 జీతంతో విఆర్‌ఎల కుటుంబాలు అవస్థలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 శాతం అటెండర్, వాచ్‌మెన్, రికార్డు అసిస్టెంట్, డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తక్షణమే ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి విఆర్‌ఎలు నిర్వహించే న్యాయమైన పోరాటానికి పిడిఎఫ్ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు లక్ష్మణరావు ప్రకటించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. సిఎం చంద్రబాబు విజన్-2047 ద్వారా పేదరికాన్ని నిర్మూలిస్తామంటున్నారని, విఆర్‌ఎల జీవితాల గురించి పల్లెత్తు మాట్లాడటం లేదని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా విఆర్‌ఎల జీతాలు పెరగక కుటుంబాలు పస్తులతో బతుకుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న విధంగా పేస్కేల్ జీతాలు చెల్లించి విఆర్‌ఎ కుటుంబాలకు భరోసా కల్పిస్తారని ఆశించిన విఆర్‌ఎల ఆశలను నీరుగార్చిందన్నారు. దశాబ్దాల తరబడి పనిచేస్తున్న నామినీలను విఆర్‌ఎలుగా గుర్తించకపోవడం అన్యాయమన్నారు. మే నెలాఖరులోగా సమస్యలను సానుకూలంగా పరిష్కరించకుంటే దశలవారీ పోరాటాలకు పూనుకోవాల్సి వస్తుందని, అవసరమైతే కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఈ సదస్సులో సంఘం రాష్ట్ర నాయకులు త్రినాథరావు, రవికుమార్, కృష్ణారావు, గురుమూర్తి, కొండబాబు, రమణ, శేఖర్, వెంకటపతి, రత్నబాబు, రహిమాన్, మొగలాబి, వెంకట్, సిఐటియు నాయకులు వి లక్ష్మణరావు, జి శ్రీనివాసులు, ఆంజనేయులు పాల్గొన్నారు.