కొడాలి, వంశీ ఇళ్లపై రాళ్ల దాడి – విజయవాడ, గుడివాడల్లో ఉద్రిక్తత

ప్రజాశక్తి – గుడివాడ, గన్నవరం :మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇళ్లపై శుక్రవారం టిడిపి కార్యకర్తలు దాడులకు దిగారు. దీంతో విజయవాడ, కృష్ణాజిల్లా గుడివాడల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ ఇంటిపై యార్లగడ్డ అనుచరులు దాడి చేశారు. వంశీ నివాసం ఉంటున్న విజయవాడ పాలీక్లీనిక్‌ రోడ్డులోని అపార్ట్‌మెంట్‌ వద్ద వీరంగం సృష్టించారు. గన్నవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు సుమారు 20 మంది నాలుగు కార్లలో ఆ అపార్ట్‌మెంట్‌ వద్దకు వెళ్లారు. వంశీ ఉంటున్న నాలుగో ఫ్లోర్‌వైపు రాళ్లు విసిరారు. ఈ దాడిలో కింద పార్కింగ్‌లో ఉన్న వంశీకి చెందిన రెండు కార్లు ధ్వంసమయ్యాయి. అనంతరం అపార్ట్‌మెంట్‌ను నలువైపులా చుట్టుముట్టి… వాహనాల్లో తిరుగుతూ హల్‌చల్‌ చేశారు. పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి అందరినీ చెదరగొట్టారు. ఇంకా అక్కడ ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. పోలీసులను పెద్దఎత్తున మొహరించారు. దాడి సమయంలో ఇంట్లో వంశీతోపాటు ఆయన అనుచరులు ఓలుపల్లి రంగా, కాట్రు శేషు, రాము, నాని ఉన్నారు. విజయవాడ రూరల్‌ మండలం నున్న ప్రాంతానికి చెందిన వైసిపి నాయకులు వంశీని అపార్ట్‌మెంట్‌లో కలిసి వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగింది. అలాగే, తెలుగు యువతకు చెందిన కొందరు నాయకులు గుడివాడలోని కొడాలి నాని ఇంటిపైకి రాళ్లు, గుడ్లతో దాడి చేశారు. ఆపై ఇంటి బయట రోడ్డుపై టపాసులు కాల్చి నానా హంగామా సృష్టించారు. ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. టిడిపి కార్యకర్తలను అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులతో టిడిపి కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. విజయవాడ రాజీవ్‌నగర్‌లో నివాసం ఉంటున్న వైసిపి నాయకులు పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటిపై గురువారం అర్థరాత్రి టిడిపి కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్ధాలు ధ్వంసమయ్యాయి. ఇంటి బయట ఉన్న ఫర్నీచర్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆపై శివారెడ్డిని చంపేస్తామంటూ బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చిన స్థానికులు భయంతో వణికిపోయారు. ఈ దాడిపై పెద్దిరెడ్డి శివారెడ్డి నున్న పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

 

 

➡️