‘ఉక్కు’లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపులు ఆపండి : సిహెచ్‌.నర్సింగరావు

Apr 11,2025 21:21 #CITU AP, #visakha steel plant

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుల తొలగింపులు ఆపాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు డిమాండ్‌ చేశారు. కార్మకుల తొలగింపులను వ్యతిరేకిస్తూ ఈ నెల 16 నుంచి కాంట్రాక్ట్‌ కార్మికుల నిరవధిక సమ్మె జరుగుతుందని తెలిపారు. విశాఖలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌లో గత మూడు మాసాల్లో మూడు వేల మందికిపైగా కాంట్రాక్ట్‌ కార్మికులను యాజమాన్యం అక్రమంగా తొలగించిందన్నారు. గత నెలలో 1213 మంది పర్మినెంట్‌ ఉద్యోగులను, ఆఫీసర్లను విఆర్‌ఎస్‌ పేరిట బయటకు పంపారన్నారు. నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను గత ఏడాది అక్టోబర్‌ 1న ఒకే రోజు తొలగించాలని నిర్ణయించి, శాంతిభద్రతల సమస్యలకు భయపడి వెనక్కు తగ్గారన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులు నైపుణ్యంతో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, వారిని తొలగిస్తే ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలుగుతుందని తెలిపారు. ప్లాంట్‌ను ప్రయివేటుపరం చేసేందుకు కంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పిస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉన్న ఉద్యోగులను తొలగించడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. కార్మికుల తొలగింపు వెంటనే ఆపేలా విశాఖ ఎంపి, గాజువాక ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని, ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని, మూడో బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. అనకాపల్లి జిల్లా డిఎల్‌.పురం, రాజయ్యపేట, బోయపాడు, అమలాపురం, బంగారమ్మపేట, పెంటకోట గ్రామాల పక్కన ఉన్న 2.9 కిలోమీటర్ల పొడవు సముద్ర ప్రాంతాన్ని ఆర్సెలార్‌ మిట్టల్‌ నిప్పన్‌ స్టీల్‌కు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. సముద్రతీరాన్ని ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టే విధానం దేశ ప్రయోజనాలకు హానికరమన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు సొంత పోర్టు కోసం కేటాయించిన రెండు వేల ఎకరాల భూమిని, గంగవరం సముద్రతీరాన్ని ఆనాటి టిడిపి ప్రభుత్వం ప్రైవేట్‌ యాజమాన్యాలకు అప్పగించిందని, ఇప్పుడు అది అదానీపరమైందని తెలిపారు. ఫలితంగా మత్య్సకారులు పూర్తిగా నష్టపోయారన్నారు. గంగవరం పోర్టులోని 300 మంది మత్య్సకారులను ఇటీవల తొలగించారని తెలిపారు. క్యాప్టీవ్‌ పోర్టును ప్రైవేట్‌ యాజమాన్యాలకు కట్టబెడితే మాదకద్రవ్యాలు, స్మగ్లింగ్‌ కార్యక్రమాలు పెరుగుతాయని హెచ్చరించారు. మిట్టల్‌ యాజమాన్యం విశాఖపట్నం పోర్టును, గంగవరం పోర్టును ఉపయోగించుకోవచ్చని తెలిపారు. సముద్రతీరాన్ని వారికి ఇవ్వడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మీడియా సమావేశంలో సంఘం విశాఖ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఎం.శ్రీనివాస్‌, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, కోశాధికారి ఎస్‌.జ్యోతీశ్వరరావు పాల్గన్నారు.

➡️