దాగుడు మూతలు ఆపండి

  • అదాని ఒప్పందాలను తక్షణమే రద్దు చేయండి
  • సిపిఎం రాష్ట్రకమిటీ డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దాడుగుమూతలు ఆపి అదానీతో చేసుకున్న ఒప్పందాలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్రకమిటీ డిమాండ్‌ చేసింది.ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వేలకోట్ల రూపాయల లంచాలు మెక్కి సెకి ద్వారా అదాని కంపెనీలతో వైసిపి ప్రభుత్వం చేసుకున్న అక్రమ విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేయాల్సింది పోయి మీనమేషాలు లెక్కించడం రాష్ట్రప్రభుత్వ అసలు నైజాన్ని బయటపెడుతుందని ఆయన పేర్కొన్నారు. అధ్యయనమంటూ కాలయాపన చేస్తూ ఇంత పెద్ద కుంభకోణాన్ని మరుగుపర్చాలని చూస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ అవినీతిపై రంకెలు వేస్తూ ఇప్పుడు అదానికి తలవంచడటం సిగ్గుచేటని విమర్శించారు. అదాని గ్రూపు సంస్థల నుంచి రూ.1,750కోట్లు ముడుపులు తీసుకొని సెకి నుంచి యూనిట్‌ విద్యుత్‌ రూ.2.49లు చొప్పున కొనుగోలు చేయడానికి గత రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అమెరికా న్యాయస్థానంలో కేసు నమోదైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అలా చేయకుండా ఆ ఒప్పందాలపై టిడిపి కూటమి సర్కారు పునరాలోచన చేస్తున్నట్లు, రాజస్థాన్‌లో ఉత్పత్తి చేసిన కరెంట్‌కు బదులు రాష్ట్రంలో అదాని ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే అంతరాష్ట్ర రవాణ చార్జి తగ్గిపోతుందని, కనుక చౌకగా కరెంట్‌ వస్తుందంటూ ప్రజల్ని నమ్మించడానికి పత్రికల్లో కట్టుకథలు రాయిస్తున్నారని పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న వార్తలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. ఇవి వాస్తవమా? కాదా? ప్రభుత్వం చెప్పాలని కోరారు. సెకి ఒప్పందాల రద్దుపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నట్లు కూడా లీకులు వచ్చాయని తెలిపారు.అవి ఏవీ సాధ్యం కాకపోతే ధర తగ్గించి విద్యుత్‌ ఇవ్వండంటూ అదానీ కంపెనీలనే రాష్ట్రప్రభుత్వం కోరుతుందని ఒక మంత్రి చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ఇవన్నీ ప్రజలను మభ్య పుచ్చి గందరగోళానికి గురిచేసేవేనని పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం దాగుడు మూతలు మాని తక్షణమే అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటిని రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

➡️