- పార్టీ నేతలతో టిడిపి అధినేత చంద్రబాబు
- గ్రీవెన్స్‌లో అర్జీల స్వీకరణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రజలకు మనం నిజం చెప్పేలోపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అబద్దాలను ప్రచారం చేయాలని చూస్తున్నారని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన గ్రీవెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ జగన్ చెబుతున్న అబద్వాలను అడ్డుకోవాలని, ప్రభుత్వం-పార్టీ సమన్వయంతో వ్యవహరించి వాటిని సమర్ధవంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. వైసిపి వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు చెప్పారు. కృష్ణా-గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ పి అశోక్‌బాబులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీస్‌ల తీరు సరిగా లేదని పార్టీ నేతలు చంద్రబాబు వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విచారణ పూర్తికాకుండానే ఈ ఘటనలో రాజకీయ ప్రమేయం లేదనడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలీసులు ఇలాంటి ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని కోరిన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయ స్వామి, పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరిస్తాం
ప్రజల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర నలుమూలాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి ఆయన అర్జీలను ఆయన స్వీకరించారు. వైసిపి ప్రభుత్వం 300 యూనిట్ల విద్యుత్ వినియోగించాననే కారణంతో తన పింఛన్‌ను తొలగించిందని గుంటూరు పట్టణం గోరంట్లకు చెందిన తన్నీరు సామ్రాజ్యం అనే దివ్యాంగురాలు ఫిర్యాదు చేశారు. తిరిగి తన పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. సిఎం సహాయనిధికి తుళ్లూరుకు చెందిన ఆలూరి వెంకటరావు, ఆలూరి ఆదినారాయణ రూ.50వేలు, ఎం శ్యామలరావు రూ.25వేలు, కె రాజేశ్వరి రూ.25వేలు, విజయనగరానికి చెందిన కె హారిక రూ.15వేలు చొప్పున విరాళం అందించారు.
గుర్రం జాషువాకు నివాళలర్పించిన చంద్రబాబు
గుర్రం జాషువా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నివాళలర్పించారు. టిడిపి కార్యాలయంలో జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళలర్పించారు. తన జీవితంలో అడుగడుగునా కుల వివక్షను ఎదుర్కొంటూనే తెలుగు సాహితీలోకంలో ప్రజ్వరిల్లిన తేజోమూర్తి, దళితాభ్యుదయవాది జాషువా అని చంద్రబాబు సామాజిక మధ్యమం ఎక్స్‌లో కూడా పొందుపరిచారు. సమసమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత అని పేర్కొన్నారు. ఆ దార్శనికుని సంఘ సంస్కరణ పోరాటాన్ని,ఆ మహాకవి సాహితీ సేవను స్మరించుకుందామని తెలిపారు.