- ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ధర్నా
ప్రజాశక్తి – సీతమ్మధార (విశాఖపట్నం) : వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులను వెంటనే ఆపాలని కోరుతూ విశాఖ అక్కయ్యపాలెం పోర్డు స్టేడియం ఎదురుగానున్న రీజనల్ కమిషనర్ ఆఫ్ లేబర్ (సెంట్రల్) కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా చేపట్టారు. ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఈ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్‌లో అనేక సంవత్సరాల నుంచి 15 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వారిలో పెక్కు మంది స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం భూములను త్యాగం చేసిన నిర్వాసితులే ఉన్నారని తెలిపారు. వారంతా ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. స్టీల్‌ప్లాంట్‌ను రక్షిస్తామని, దానికి అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం, స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం ఒకపక్క చెబుతూ మరోపక్క ప్లాంటును ప్రయివేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని, ప్రతి మూడు నెలలకు 1400 మంది చొప్పున మొత్తం 5600 మందిని తొలగించేందుకు కుటిలయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. తక్షణమే కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వారందరికీ ఇఎస్‌ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున సమ్మె చేయడానికి కార్మికవర్గం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఎం శ్రీనివాసరావు, ఆర్‌కెఎస్‌వి కుమార్, ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు జి శ్రీనివాస్, నమ్మి రమణ, మంత్రి రవి, కె వంశీ, యు అప్పారావు, పి భాస్కరరావు, రామిరెడ్డి పాల్గొన్నారు.
స్టీల్ హెచ్‌ఒడి కార్యాలయాల వద్ద ఆందోళనలు
కాంట్రాక్టు కార్మికుల తొలగింపులను ఆపాలని, ఉక్కు నేత అయోధ్యరామ్‌కు ప్లాంట్ యాజమాన్యం ఇచ్చిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్‌లోని హెచ్‌ఒడిల కార్యాలయాల వద్ద ఉక్కు కార్మికులు ధర్నాలు నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు కెఎస్‌ఎన్ రావు, జె అయోధ్యరామ్, రమణమూర్తి, పి శ్రీనివాసరాజు, వైటి దాస్, యు రామస్వామి తదితరులు పాల్గొన్నారు.