ప్రజా ఉద్యమాలు బలోపేతం

 చర్చలు సమీక్షిస్తూ వి శ్రీనివాసరావు
ప్రజాశక్తి-సీతారాం ఏచూరి నగర్‌ (నెల్లూరు) : గత మహాసభ నుండి ఈ మహాసభ మధ్య కాలంలో ప్రజా సమస్యలపై జరిగిన ఉద్యమాలు, పోరాటాలను వచ్చే మూడేళ్లలో మరింత పటిష్టంగా నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నెల్లూరులో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర 27వ మహాసభలో భాగంగా మూడో రోజైన సోమవారం రాజకీయ నిర్మాణ నివేదికపై ప్రతినిధుల చర్చ అనంతరం సమీక్షిస్తూ ఆయన మాట్లాడారు. మహాసభలో పాల్గొన్న ప్రతినిధులందరూ తమ జిల్లాలు, రంగాల వారీగా గ్రూపు చర్చల్లో పాల్గొన్నారు. 33 రంగాలు, 27 జిల్లాలకు చెరదిన 83 మంది చర్చల్లో పాల్గొన్నారని, అంటే, మహాసభకు హాజరైన ప్రతి ఆరుగురిలో ఒకరు వేదికపై చర్చల్లో పాల్గొనడం మంచి పరిణామమని వివరించారు. అఖిల భారత రాజకీయ విధానంలో భాగంగా ఇండియా బ్లాక్‌తో సర్దుబాటు చేసుకున్న విధానాన్ని రాష్ట్రంలో అమలు చేశామని, ఓట్ల రూపంలో గణనీయమైన మార్పు రానప్పటికీ ఒక వాతావరణం ఏర్పడడానికి దారితీసిందని వివరించారు. ఇళ్ల స్థలాల సమస్యపై పాలకులు దోబూచులాడుతున్నారని, ఒకరు సెంటు ఇస్తానంటే…మరొకరు రెండు, మూడు సెంట్లు ఇస్తామని భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. పోలవరం నిర్వాసితులకు పరిహారం కోసం, ఏజెన్సీలో జీవో నెం.3 పునరుద్ధరణ కోసం, భాషా వలంటీర్ల సమస్యపై ఆందోళనలు జరిగాయని, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఫార్మా కంపెనీల్లో ప్రమాదాల్లో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు, ఎన్‌టిఆర్‌ జిల్లా జగ్గయ్యపేట సిమెంట్‌ ఫ్యాక్టరీలో బాయిలర్‌పేలి కొంతమంది మృతిచెందిన ఘటనలో గరిష్టస్థాయిలో పరిహారం ఇప్పించేలా కృషి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విజయనగరం మిమ్స్‌లో ఆందోళనలు జయప్రదం కావడం, తాండవ షుగర్స్‌ రైతులు చెరకు బకాయిలు సాధించడం, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను అడ్డుకోవడం, తిరుపతిలో టిటిడి అటవీ కార్మికుల రిలే దీక్షలు, పాణ్యం గ్రీన్‌కోలో ఆందోళన, నెల్లూరు జెన్‌కో ప్రయివేటీకరణను అడ్డుకోవడం వంటి విషయాల్లో పార్టీ చురుకుగా పనిచేసిందని చెప్పారు. చెత్తపన్నుపై విశాఖ, విజయవాడ, కర్నూలు, నెల్లూరుల్లో పార్టీ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల చెత్తపన్ను వసూలును ప్రభుత్వం రద్దు చేసుకుందని వివరించారు. వివిధ సమస్యలపై వివిధ జిల్లాల్లో పాదయాత్రలు చేయడం మంచిదేనని, అయితే అనంతపురం జిల్లా మాదిరిగా ఒక దాని వెంట మరోటి నిర్వహించేలా ప్రణాళికలు ఎక్కడికక్కడ రూపొందించుకోవాలని, రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు సహా వివిధ మౌలిక సదుపాయాల కోసం స్థానిక నాయకత్వం చొరవ పెంచుకోవాలని సూచించారు. వరద సహాయ కార్యక్రమాల్లో విజయవాడ, గుంటూరు, కర్నూలు వంటి జిల్లాల్లో పార్టీ శ్రేణులు చురుకుగా పాల్గొన్నాయని చెప్పారు. అయితే మనం చేసిన ఉద్యమాలు, పోరాటాలు, సేవా కార్యక్రమాలకు తగ్గట్లుగా ప్రజాపునాది పెరగలేదన్నారు. ప్రజా రంగాలు సమస్యలను అధ్యయనం చేసి ఆందోళనా కార్యక్రమాలను రూపొందించుకోవాలని, సొంత చొరవతో ప్రజలతో మమేకం కావాల్సి ఉందని చెప్పారు. పార్టీలో కొన్ని అన్యవర్గ ధోరణులు వ్యక్తమవుతున్నాయని, సైద్ధాంతిక చైతన్యాన్ని పెంచడం ద్వారా వాటిని నిరోధించాలన్నారు. రాష్ట్రంలో మతోన్మాద ప్రమాదం పెరుగుతోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్పొరేట్‌ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతం చేయాలని చెప్పారు. పార్టీ సొంత బలం పెంచుకోవడంతో పాటు వామపక్ష ఐక్యతకు కృషి చేయాలన్నారు. వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు విశాల శక్తులను కూడగట్టాలని పిలుపునిచ్చారు.

➡️