- ఎపి అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ వినతి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఐసిడిఎస్‌ను బలోపేతం చేయడంతోపాటు బడ్జెట్‌ను కూడా పెంచాలని ప్రభుత్వానికి ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. జులై 10 అఖిల భారత కోర్కెల దినోత్సవం సందర్భంగా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం స్త్రీ, శిశు సంక్షేమశాఖ డైరెక్టరుకు రవిప్రకాష్ రెడ్డికి యూనియన్ నేతలు వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు చేయాలని, ఐఎల్‌సి సిఫార్సుల ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు, పెన్షన్, పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. 42 రోజుల సమ్మె కాలంలో ప్రభుత్వం మినిట్స్ కాపీలో అంగీకరించిన అంశాలకు తక్షణం జిఓలు ఇవ్వాలని, అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌ను బలోపేతం చేయడంతోపాటు ఐదేళ్లలోపు పిల్లలు ప్రైవేటు కాన్వెంట్‌లకు వెళ్లకుండా సర్క్యులర్ ఇవ్వాలని, 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరారు. ఐసిడిఎస్ ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, ఎన్నికల తర్వాత జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అంగన్‌వాడీ కార్యకర్తలను బలవంతంగా రాజీనామాలు చేయించడం, సెంటర్లకు తాళాలు వెయ్యడం, రాజకీయ వేధింపులకు పాల్పడటం ఆపాలని వారు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జి బేబీరాణి, కె సుబ్బరావమ్మ ఉన్నారు.