వై.ఎస్ షర్మిల డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు, వ్యాఖ్యలు చేసే వారిని కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వై.ఎస్ షర్మిల అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. భారతిరెడ్డిపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని తెలిపారు. ఇటువంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానమని పేర్కొన్నారు. తప్పుడు కూతలు కూసిన వారిని, రేటింగ్స్ కోసం ఎంటర్‌టైన్ చేసే యూట్యూబ్ ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉందన్నారు. ఇటువంటి వారు ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందేనని చెప్పారు. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసిపి, టిడిపిలేనని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి ఈ రెండు పార్టీలే ఆదర్శమన్నారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పటించారని తెలిపారు.
