పటిష్టంగా ఎన్నికల కోడ్‌ అమలు

  • పార్టీల ప్రచారాల్లో పాల్గొంటే అధికారులపై వేటు
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల కోడ్‌ను రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రచారాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాతో కలిసి కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్‌ మాట్లాడుతూ.. ఎన్నికల పరీశీలకులుగా వెళ్తున్న అధికారులంతా ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ వెబ్‌సైట్లన్నింటిలో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన ఫొటోలను, ఫ్లెక్సీలను తొలగించాలని, ప్రభుత్వ ఆస్తులపై గల రాజకీయపరమైన ప్రకటనలనూ తొలగించాలని కార్యదర్శులను ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి సిఇఒ ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్‌లో నివేదిక ఇవ్వాలన్నారు.
సిఇఒ ఎంకె మీనా మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక బడ్జెట్‌ ప్రొవిజన్‌ ఉన్నప్పటికీ కొత్త ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్ల మంజూరు, హామీలు, శంకుస్థాపనలు పూర్తిగా నిషేధమని ఆయన స్పష్టం చేశారు. పనులు పూరైన వాటికి నిధుల విడుదలలో ఎలాంటి నిషేధం లేదన్నారు. అలాగే వివిధ రకాల పింఛన్ల పంపిణీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులు ఎలాంటి సమీక్షలు, వీడియోకాన్ఫరెన్స్‌లు నిర్వహించకూడదన్నారు. మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించకూడదని వివరించారు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంతి సహా మంత్రుల ఫొటోలు ఉండకూడదన్నారు. వివిధ రకాల బిల్లులు, సర్టిఫికెట్లపైనా ప్రజా ప్రతినిధుల ఫొటోలు ఉండకూడదని సిఇఒ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా, బహుమతులు, ఇతర లబ్ధి పొందినా అటువంటి వారిపై చర్యలు ఉంటాయని మీనా పేర్కొన్నారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్‌ కుమార్‌, వై శ్రీలక్ష్మి, కె విజయానంద్‌, ఎమ్‌టి కృష్ణబాబు, అనంతరాము, శశిభూషణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️