సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయాలి

  • ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌
  • ప్రిన్సిపల్‌ సెక్రటరీకి యూనియన్‌ వినతి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్వాడీలు 42 రోజులు సమ్మె ఒప్పందంలో అంగీకరించిన అంశాలు, మినిట్స్‌ కాపీ ఆధారంగా పెండింగ్లో ఉన్న జిఓలు ఇవ్వాలని, అంగన్‌వ్వాడీ యూనియన్లను చర్చలకు పిలిచి వేతనాలు పెంచాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు బుధవారం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి బేబీరాణి, కె సుబ్బరావమ్మ, నాయకులు జ్యోతి రత్నకుమారి… స్త్రీ శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని కోరారు. మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ జిఓ ఇవ్వాలని కోరారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చుల కింద రూ.20 వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగంలో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సమ్మెకాలంలో చనిపోయిన వారికి కూడా ఇది అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె కాలంలో పెట్టిన కేసులు రద్దు చేయాలని, ఫోన్లలో ఉన్న నాలుగు యాప్‌లను ఒకే యాప్‌గా మార్చాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌ వైజర్‌ పోస్టులను భర్తీ చేయాలన్నారు. హెల్పర్ల ప్రమోషన్లలో నిర్దిష్ట గైడ్‌లైన్స్‌ అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్‌ లీవు కనీసం మూడు నెలలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సెంటర్లలో ఇబ్బందులు పరిష్కరించాలి
అంగన్‌వాడీ సెంటర్ల నిర్వహణలో వస్తున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ మహిళలు రికార్డులు సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సి వస్తోందని తెలిపారు. గుంటూరు జిల్లాలో హెల్పర్ల ప్రమోషన్లకు ఇంటర్వ్యూలు జరిగి ఆరు నెలలు గడుస్తున్నా ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. వెంటనే ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వాలని, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ప్రమోషన్లకు ఎమ్మెల్యే సంతకాలు కావాలని, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో సర్పంచుల సంతకాలు కావాలని వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. సత్యసాయి, కడప, ఏలూరు జిల్లాల్లో నాలుగు నెలల నుంచి కందిపప్పు లేదని, కూరగాయలకు అదనపు ఖర్చు అవుతోందని, కొన్ని జిల్లాల్లో ఆయిల్‌ సరఫరా లేదని తెలిపారు. అంగన్‌వాడీ సెంటర్లకు కందిపప్పు ఇవ్వాలని కోరారు. అన్నమయ్య జిల్లాలో కెమెరాలు తప్పకుండా ఉండాలని చెబుతున్నారని, నెట్‌ పనిచేయకపోడంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీన్ని రద్దు చేయాలని కోరారు. గర్భిణులకు సీమంతాలు, పోషకాహార వారోత్సవాలకు రూ.250 చొప్పున కేటాయిస్తున్నారని, సరిపోవడం లేదని, అదనంగా బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పెద్దయెత్తున సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కోరారు. బిఎల్‌ఒ డ్యూటీలు వేశారని, పెండింగ్‌ ఉన్న టిఎ, అద్దె బిల్లులు కూడా ఇవ్వాలన్నారు. అలాగే కొన్ని జిల్లాల్లో టిడిపి నాయకులు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మెమోలు ఇప్పిస్తున్నారని, రాజకీయ వేధింపులు ఆపాలని కోరారు.

ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌ నుండి రూ.100
వరదల్లో నష్టపోయిన ప్రజానీకం సహాయార్థం ప్రతి అంగన్‌వాడీ సెంటర్‌ నుండి రూ.100 చొప్పున ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వాలని నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు. ఈ మేరకు చెక్కును అందజేయడానికి అనుమతి ఇవ్వాలని యూనియన్‌ నాయకులు ప్రిన్సిపల్‌ సెక్రటరీని కోరారు.

➡️