ప్రమాదకర చట్టాలకు వ్యతిరేకంగా 16న సమ్మె

Feb 13,2024 14:47 #CH Narsingrao, #CITU
  • సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : రవాణా రంగ కార్మికులు పాలిట శాపంగా మారిన క్రిమినల్‌ చట్టాలకు వ్యతిరేకంగా 16వ తేదిన జరగనున్న సమ్మెలో రవాణా రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఎన్‌పిఅర్‌ భవనంలో సిఐటియు నగర అధ్యక్షులు ఏ.జగన్మోహన్‌ అధ్యక్షతన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రవాణా రంగంలో అత్యధిక మంది ప్రయాణీకులకు సేవలందించే వారిలో ఆటో డ్రైవర్లది కీలకస్థానమాన్నారు. ప్రభుత్వాలు ఏ విధమైన సహాయం చేయకపోయినా, తమ సొంత పెట్టుబడితో ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీల ద్వారా ఆటో, క్యాబ్‌లను కొనుగోలు చేసి, స్వయం ఉపాధిగా జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీల అధిక వడ్డీలకు బలైపోతున్నారు. ప్రభుత్వాలు ఉపాధి కల్పించకపోవడంతో స్వయం ఉపాధిగా ఆటోలు నడుపుతూ తమ కుటుంబ పోషణ కోసం ప్రతిరోజు ప్రయాణికులకు సేవలందిస్తూ, చాలీచాలని ఆదాయంతో అర్ధాకలితో జీవిస్తున్నారన్నారు. ప్రపంచ మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గిన కేంద్రప్రభుత్వ విధానాలు కారణంగా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అసలే కిరాయిలు లేక సతమతమవుతున్న ఆటో కార్మికులకు ఇంధన ధరలు పెరుగుదల వలన ఆదాయం భారీగా తగ్గిపోయిందన్నారు. ప్రతి సంవత్సరం 20% థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియం పెంచుకునేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు వీలు కల్పించడంతో 2014లో 1400 రూపాయలు ఉండే ఇన్సూరెన్స్‌ ప్రస్తుతం 5800 వరకు పెరిగిపోయిందన్నారు. ఫిట్నెస్‌ రెన్యువల్‌ 2014లో 320 రూపాయలు ఉండేది ప్రస్తుతం 660 రూపాయలకు పెరిగిపోయిందన్నారు. ఇది చాలదన్నట్లు ఆర్టీవో ఆఫీస్‌ లో ఏజెంట్లు లేనిదే ఎటువంటి పని జరగని పరిస్థితి తయారయిందన్నారు. ఏజెంట్లు ద్వారా ముడుపులు చెల్లిస్తే గాని ఆర్టీవో ఆఫీస్‌ లో ఫిట్నెస్‌ రెన్యువల్‌, లైసెన్స్‌ వంటివి చేయని పరిస్థితి ఉందన్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సెన్సార్‌ కెమెరాలతో ట్రాఫిక్‌ పోలీసులు విధించే చలానాలు కట్టాలంటే అప్పులు చేయక తప్పడం లేదన్నారు. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, ఇతర రవాణా రంగ కార్మికులు ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్న, రవాణా కార్మికుల సంక్షేమానికి ఎటువంటి చట్టం లేకుండా పోయిందన్నారు. డ్రైవర్లు ఏ విధమైన ప్రమాదానికి గురి అయిన ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సహాయం అందడం లేదన్నారు. డ్రైవర్లు ఇతర రవాణా రంగ కార్మికులకు రక్షణ కల్పించే విధంగా సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయాలని (వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు) ప చేయాలని సిఐటియు డిమాండ్‌ చేస్తోందన్నారు.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగించే విధంగా బి.ఎన్‌.ఎస్‌ 106 (1) (2) హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని 21 డిసెంబర్‌ 2023న తీసుకువచ్చిందన్నారు. గతంలో ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణం అయితే గరిష్టంగా 2 సంవత్సరాలు శిక్ష ఉండేది, ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన బి.ఎన్‌.ఎస్‌ 106 (1) (2) ప్రకారం 10 సంవత్సరాల జైలు 7 లక్షల జరిమానా విధించేలా నిబంధనలు తయారు చేసిందన్నారు. ఇప్పటివరకు ప్రమాదాలు జరిగిన వెంటనే స్టేషన్‌ బెయిల్‌ తీసుకునే అవకాశం ఉండేది, కొత్త చట్టంలోని నిబంధనల వలన కోర్టులో బెయిల్‌ కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. సమయం, డబ్బు ఎక్కువగా ఖర్చు చేయగలిగితేనే బెయిల్‌ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచంలో రోడ్డు నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా మనదేశంలో రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. జాతీయ అర్హదారులు గ్రామ, పట్టణ జనావాసాల మధ్యలోంచి నిర్మాణం చేయడానికి వీలులేదు,కానీ మనదేశంలో అందుకు భిన్నంగా జరుగుతున్నాయన్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా రోడ్డు నిర్మాణాలు చేస్తున్నారు ఇలాంటి ఉల్లంఘనలో కోకొల్లలు ఉన్నాయన్నారు.

ఇటువంటి పరిస్థితులలో ఆటో డ్రైవర్లు ఇతర రవాణా రంగ కార్మికులు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన బి.ఎన్‌.ఎస్‌ 106 క్లాజ్‌ (1) (2) రద్దు చేయాలని ఆటో, ట్రాలీ యూనియన్‌ (సిఐటియు) డిమాండ్‌ చేస్తున్నాయన్నారు. అలాగే ఆటో డ్రైవర్లు, ఇతర రవాణా రంగ కార్మికులకు రక్షణ కల్పించే విధంగా సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్త ఒకరోజు సమ్మెలో డ్రైవర్లందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం సబాద్యక్షులు ఏ.జగన్మోహన్‌ మాట్లాడుతూ బి ఎన్‌ ఎస్‌ 106 (1) (2) చట్టాన్ని రద్దు చేయాలని,జీవో నెంబర్‌ 21 రద్దు చేయాలని,సమగ్ర సంక్షేమ చట్టాన్ని (వెల్ఫేర్‌ బోర్డును) ఏర్పాటు చేయాలని, ఫ్రీ బస్‌ సర్వీస్‌ వలన ఆటో డ్రైవర్లకు కలిగే నష్టానికి పరిహారంగా నెలకు 12 వేల రూపాయలు చెల్లించాలని, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని జరుగుతున్న సమ్మెలో రవాణా రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్‌, టి వి రమణ, బి.రమణ, శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి శ్రీనివాసరావు, ఎస్‌ డబుల్యు ఎఫ్‌ రాష్ట్ర నాయకులు వి.రాములు, ఎపి మెడికల్‌ రిప్సే యూనియన్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.ఎస్‌రవికుమార్‌, ఎ.పి.ఆటో ట్రాలీ డ్రైవర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకులు పాల్గొన్నారు.

➡️