సిఎం ప్రమాణ స్వీకారోత్సవానికి పటిష్ట ఏర్పాట్లు

Jun 10,2024 08:19 #ap cm, #chandrababau
  • కేసరిపల్లి సభాస్థలిని పరిశీలించిన సిఎస్‌

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నంంద్ర మోడీ, పలు రాష్ట్రాల సిఎంలు, కేంద్ర మంత్రులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు రానున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆదివారం డిజిపి హరీష్‌కుమార్‌గుప్తా, కార్యక్రమ ప్రత్యేక అధికారులు ప్రద్యుమ్న, బాబు ఎ, వీరపాండియన్‌, వ్యవసాయశాఖ కమిషనరు హరికిరణ్‌, అదనపు డిజిపి బాగ్చి, ఐజిలు రాజశేఖర్‌బాబు, అశోక్‌కుమార్‌, పోలీస్‌ కమిషనరు రామకృష్ణ, కృష్ణా జిల్లా కలెక్టరు డికె బాలాజీ, జిల్లా పోలీస్‌ అధికారి అద్నాన్‌ నయూమ్‌ ఆస్మాలతో కలిసి గన్నవరం మండలం కేసరిపల్లిలోని ఐటి పార్కు మేథా టవర్స్‌ సమీపంలోని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత మేథా టవర్స్‌ సమీపంలో జరుగుతున్న సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమం వీక్షించేందుకు వీలుగా సభా ప్రాంగణంతోపాటు వెలుపల ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఎల్‌ఇడి స్క్రీన్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. గన్నవరం జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్‌ బంక్‌, ఎన్‌టిఆర్‌ ప్రభుత్వ పశు వైద్యకళాశాల, కేసరపల్లి ముస్తాబాద్‌ రోడ్డు సమీపంలో రెండు చోట్ల పార్కింగ్‌ స్థలాలు, ఎలిట్‌ విస్టాస్‌, మేథా టవర్స్‌, ఇతర లే అవుట్లలో ఎంపిక చేసిన పార్కింగ్‌ స్థలాలను పరిశీలించారు.
ప్రధాని, సిఎంలు సభా ప్రాంగణానికి రావడానికి వీలుగా బారికేడ్లు
ప్రధానితోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన సభ వేదిక వద్దకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా బారికేడ్‌ ఏర్పాటు చేయాలని, అప్రోచ్‌ రహదారికి మరమ్మతులు చేయాలని సిఎస్‌ ఆదేశించారు.

ఎలీట్‌ విస్టాస్‌లో విఐపి పార్కింగ్‌
ఎలీట్‌ విస్టాస్‌లో ఎమ్మెల్యేలు, ఎంపిలు, న్యాయమూర్తులు, ప్రముఖులకు పార్కింగ్‌ స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ నుంచి వారు సభాస్థలికి చేరుకునేందుకు వీలుగా అప్రోచ్‌ రహదారిని ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డుకు ఇరువైపులా ప్రత్యేకమైన వస్త్రాలతో సుందరీకరించాలని అధికారులకు సిఎస్‌ సూచించారు. పార్కింగ్‌ ప్రదేశాల నుంచి ప్రధాన సభకు చేరుకునేందుకు వీలుగా అప్రోచ్‌ రహదారులను నిర్మించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ పర్యటనలో కృష్ణా, గుంటూరు జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు గీతాంజలిశర్మ, జి రాజకుమారి, విజయవాడ, రాజమండ్రి మున్సిపల్‌ కమిషనర్లు స్వప్నిల్‌ దినకర్‌, దినేష్‌కుమార్‌, డిఐజి గోపీనాథ్‌ జెట్టి, విజయవాడ డిసిపి అధిరాజ్‌ ఎస్‌, రానా, గుడివాడ ఆర్‌డిఒ పి పద్మావతి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

➡️