భూ యాజమాన్య హక్కు చట్టం రద్దు చేసే వరకూ పోరాటం

Mar 31,2024 22:00 #ilu, #press meet

-ఐలు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్‌
ప్రజాశక్తి- ఏలూరు :రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేసే వరకూ పోరాడుతామని ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఏలూరులోని సిఐటియు కార్యాలయంలో ఐలు రాష్ట్ర కమిటీ సమావేశం కెంగర కుమార్‌ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ భూయజమాన్య హక్కుల చట్టం రద్దు కోసం న్యాయవాదులు ఇటీవల కాలంలో అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. దీనిపై ప్రజల్లో మరింత ప్రచారం సాగించి వారినీ ఈ పోరాటంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 531 కోర్టుల్లో కనీస సౌకర్యాలు లేక కక్షిదారులు, న్యాయవాదులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కోర్టుల్లో న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది కొరత వల్ల కక్షిదారులకు న్యాయం అందడంలో ఆలస్యం అవుతోందన్నారు. ఖాళీలను భర్తీ చేయాలని, కోర్టుల్లో మహిళా న్యాయవాదులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లూరి మాధవరావు మాట్లాడుతూ దేశంలోని న్యాయవ్యవస్థను భయపెట్టేందుకు కొంతమంది న్యాయవాదులు రాజకీయ నాయకులకు లోబడి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం సరైనది కాదన్నారు. రాష్ట్రంలో ఐలును బలోపేతం చేసి న్యాయవాదులు, ప్రజల హక్కులు కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. ఐలు రాష్ట్ర గౌరవాధ్యక్షులు దిగుపాటి రాజగోపాల్‌, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఐలు అధ్యక్షులు నర్రా శ్రీనివాసు, ఐలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కొల్లు సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు.

➡️