MIMS మిమ్స్‌ ఉద్యోగుల ఆందోళన తీవ్రతరం

Apr 2,2024 20:55 #CITU, #Mims employees, #problems

– ర్యాలీ, రహదారిపై బైఠాయింపు
– 150 మంది అరెస్టు, విడుదల
ప్రజాశక్తి-విజయనగరం కోట :గత 62 రోజులుగా సమ్మె చేస్తూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా యాజమాన్యంగానీ, అధికారులుగానీ స్పందించకపోవడంపై మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు ఆందోళన తీవ్రతరం చేశారు. మిమ్స్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన మంగళవారం విజయనగరం జిల్లా తోటపాలెంలోని ఎల్‌బిజి భవనం నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ రహదారిపై బైఠాయించారు. దీంతో వందలాదిగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు మిమ్స్‌ ఉద్యోగులను, నాయకులను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో మిమ్స్‌ ఉద్యోగి దుప్పాడ ధనలక్ష్మి సొమ్మసిల్లి కింద పడిపోయారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు 150 మందిని అదుపులోకి తీసుకోగా, 75 మందిపై కేసులు నమోదు చేసి వ్యక్తిగత పూచీకతులపై విడిచిపెట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ అధ్యక్షులు టివి రమణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సురేష్‌ మాట్లాడుతూ.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, వేతన ఒప్పందం అమలు చేయాలని, సస్పెన్షన్‌లు, వేధింపులు ఆపాలని, ప్రభుత్వం ప్రకటించిన డిఎ అమలు చేయాలని, అన్యాయంగా తొలగించిన ఇద్దరు ఉద్యోగులను వెంటనే విధులోకి తీసుకోవాలని, అగ్రిమెంట్‌ను అమలు చేయాలని కోరుతూ పోరాడుతుంటే యాజమాన్యం చట్టాలను ధిక్కరించి మొండిగా వ్యవహరిస్తోందన్నారు. మిమ్స్‌లో ప్రజలకు సక్రమంగా వైద్య సేవలు అందడంలేదని తెలిపారు. చివరికి వైద్య విద్యార్థులకు చదువు కూడా అగిపోయిందన్నారు. అయినా అధికారులకు గానీ, ప్రజా ప్రతినిధులకు గానీ చీమకుట్టినట్లైనా లేదని తెలిపారు. యాజమాన్యం స్పందించి చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అక్రమ అరెస్టులు, కేసులతో ఉద్యమాన్ని ఆపలేరని, సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.సుధారాణి, ఉద్యోగులు కె.కామునాయుడు, ఎం.రాంబాబు, కె.మధు, బంగారు నాయుడు, నాగభూషణం, మూర్తి, అప్పలనాయుడు, గౌరీ, స్వర్ణ, భవాని, ఆదినారాయణ, నర్సింగ, రామ నాయుడు పాల్గొన్నారు.

➡️