ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ వద్ద ఉన్న వేద పాఠశాల విద్యార్థి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నానికి చెందిన సాయి శివ సూరజ్ (16) కోటప్పకొండ వద్ద టిటిడి ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన్ పీఠం వేద పాఠశాలలో అగమ శాస్త్రం 4వ ఏడాది చదువుతున్నారు. బుధవారం రాత్రి తోటి విద్యార్థులతో సరదాగా మాట్లాడిన సూరజ్ తెల్లవారేసరికి వసతి గృహంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. వసతి గృహం సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. వేదపాఠశాల ప్రిన్సిపల్ కోట కృష్ణమూర్తి వేధింపుల వల్లే సాయిశివసూరజ్ ఆత్మహత్య చేసుకున్నాడని బ్రాహ్మణ సంఘం పెద్దలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ సిఐ పి.రామకృష్ణ తెలిపారు.