- డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహణ
ప్రజాశక్తి- విజయనగరం టౌన్ : విజయనగరం జిల్లా కేంద్రంలో భగత్‌సింగ్ స్టూడెంట్ ఫెస్ట్ ఉత్సాహపూరిత వాతావరణంలో శనివారం ప్రారంభమైంది. డ్రగ్స్ నిర్మూలనే ధ్యేయంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన మూడు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం తొలిరోజు విద్యార్థుల ర్యాలీతో ఆరంభమైంది. నగరంలోని ఆర్‌టిసి కాంప్లెక్సు నుంచి గురజాడ కళాభారతి ఆడిటోరియం వరకు ర్యాలీ సాగింది. అనంతరం ఆడిటోరియంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు డి.రాము అధ్యక్షతన జరిగిన సభలో భగత్‌సింగ్, గాంధీజీ చిత్రపటాలకు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.రామ్మోహన్ మాట్లాడుతూ.. డ్రగ్స్ వంటి వ్యసనాల కంటే విజ్ఞానం, వినోదంతో ఆనందం లభిస్తుందని తెలిపారు. అందులో భాగంగానే స్టూడెంట్ ఫెస్ట్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. యువతలో పెడధోరణులకు వ్యతిరేకంగా భగత్‌సింగ్, గాంధీజీ స్ఫూర్తితో మెరుగైన సమాజం కోసం కృషి చేద్దామని కోరారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు పావని మాట్లాడుతూ.. క్షుద్రపూజల పేరుతో ఉత్తరప్రదేశ్‌లో ఓ విద్యార్ధుడిని నరబలి ఇవ్వడం దారుణమన్నారు. మూఢనమ్మకాలు, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఫెస్ట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కన్వీనర్ చీకటి దివాకర్ మాట్లాడుతూ… యువతలో వస్తున్న పెడధోరణలకు వ్యతిరేకంగా అవగాహన, చైతన్యం తీసుకొచ్చేందుకు ఎస్‌ఎఫ్‌ఐ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. మూడు రోజుల కార్యక్రమాలను ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేష్ వివరించారు. అనంతరం ఫెస్ట్‌లో నిర్వహించిన కళారూపాలు, కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సారా తాగడం వల్ల అనర్థాలను వివరిస్తూ గాయకుడు తిరుపతిరావు పాడిన పాట సభికులను అలరించింది. నాన్‌చాక్ తిప్పుతూ ఆత్మరక్షణ విద్యను బొబ్బిలికి చెందిన విద్యార్థిని సృజన ప్రదర్శించింది. గురజాడ అప్పారావు రాసిన పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథాంశాన్ని వివరిస్తూ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శన ఆలోచింపజేసింది. జానపద కళాకారుడు జానకిరామ్ బృందం ఆలపించిన జానపద గీతాలు ఉర్రూతలూగించాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హుషారైన పాటలకు నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆకట్టుకున్నారు.