కదంతొక్కిన విద్యార్థి యువజన సంఘాలు

  • ఉక్కు పరిరక్షణ కోసం ఆందోళనలు, నిరసన దీక్షలు
  • సొంత గనులు కేటాయించాలని, ఉద్యోగుల బలవంతపు బదిలీలు ఆపాలని డిమాండ్‌

ప్రజాశక్తి-యంత్రాంగం : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం విద్యార్థి, యువజన సంఘాల నేతలు కదంతొక్కారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆపాలని, ఉద్యోగుల బలవంతపు బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని, ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ధర్నాలు, మానవహారాలు, నిరసన దీక్షలు చేపట్టారు. విశాఖ ఉక్కును ప్రయివేటీకరించబోమంటూనే వేలాది మంది కార్మికులను తొలగించాలని చూడడం దారుణమని, ఇంకా ప్రజలను మభ్య పెట్టాలని చూడటం అత్యంత దుర్మార్గమని తెలిపారు. ఆంధ్రుల ఆత్మబలిదానాలతో సాధించిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టకుంటే ఐక్య ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద దీక్షలను ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్‌ ఎ.అజశర్మ ప్రారంభించి మాట్లాడుతూ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టి అమరుల త్యాగాలను బలి పెట్టాలని చూస్తోందని, దీనిని ఉధృత పోరాటం ద్వారా విద్యార్థులు, యువజనులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి నాలుగు రోడ్లు జంక్షన్‌ వద్ద దీక్ష శిబిరాన్ని జనసేన పార్టీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సందర్శించి మద్దతు తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిర్ణయానికి తాము వ్యతిరేకమని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కేంద్ర మంత్రితో మాట్లాడుతున్నారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని నందం గనిరాజు సెంటర్‌, కాకినాడ కలెక్టరేట్‌ వద్ద దీక్షలు చేపట్టారు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల బదిలీలు, తొలగింపులు ఆపాలని పెద్ద ఎత్తున నినదించారు. దీక్షల్లో విద్యార్థి సంఘాల నాయకులతో పాటూ పలు ప్రజా, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలి వద్ద రిలే నిరాహార దీక్షలను ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనరావు ప్రారంభించారు. ప్రజానాట్యమండలి కళాకారులు చింతాడ రామచంద్రరావు, ఎస్‌.శ్రీనివాస్‌ గీతాలను ఆలపిస్తూ పోరాటానికి మద్దతు తెలిపారు. దీక్షలకు సిఐటియు, ఎఐటియుసి, వైఎస్‌ఆర్‌టియు, స్టీల్‌ప్లాంట్‌ యూనియన్‌ నాయకులు సంఘీబావం తెలిపారు.
విజయనగరంలో కెఎల్‌పురం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ నిరసన ప్రదర్శన చేశారు. స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించకుండా, ఉత్పత్తి జరగనీయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందన్నారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద మానవహారం నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. పార్వతీపురంలో ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ, అనంతరం ధర్నా చేశారు. ఆందోళనకు సిపిఎం, ఎపి రైతు సంఘం నాయకులు సంఘీభావం తెలిపారు.

కర్నూలు, నంద్యాల, అనంతపురం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీక్షలకు సిపిఎం, సిఐటియు నాయకులు ప్రారంభించి మద్దతు తెలిపారు. కడపలోని అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన దీక్షలో ఎఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు ఎల్‌.రాజశేఖర్‌ మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. తిరుపతిలోని ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట దీక్షలనుద్దేశించి డివైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయచంద్ర, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి చలపతి మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

➡️