విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలి

  • ఘనంగా ముగిసిన దసరా సాంస్కృతికోత్సవాలు

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక, సామాజిక, క్రీడాంశాలలో నైపుణ్యాలు పెంచుకోవాలని శాసన సభ్యులు గద్దె రామమోహన్‌ అన్నారు. సేఫ్‌, ఎంబివికెతో పాటు వివిధ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దసరా సాంస్కృతికోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం సాయంత్రం విజయవాడ మొగల్‌రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్దె రామమోహన్‌ హాజరై మాట్లాడుతూ విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి వారు సన్మార్గంలో నడిచేందుకు ఇలాంటి సాంస్కృతిక పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఇలాంటి పోటీల్లో యువత పాల్గొని నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు చక్కటి విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని ఆకాంక్షించారు. మూడు రోజులపాటు చక్కటి కార్యక్రమాలను నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. ఎంబివికె కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ మాట్లాడుతూ దసరా అంటే ఎంతో విశిష్టత ఉందని.. అయితే, నాటి దసరా కాంతులు ఇప్పుడు లేవన్నారు. నేటితరం విద్యార్థులకు మన సంస్కృతిని తెలియజేయడంతోపాటు వారిని సన్మార్గంలో పయనింపజేయాలన్న ఉద్దేశంతోనే దసరా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించామని తెలిపారు. దసరా ఉత్సవాల్లో విద్యా సంస్థల నుండి విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్ధ మహిళా డిగ్రీ కళాశాల పూర్వ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టి.విజయలక్ష్మి, సిద్దార్థ డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్‌ కల్పన, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ పద్మజ, సిద్ధార్థ బిఇడి కళాశాల ప్రిన్సిపల్‌ సశేషశ్రీ, సేఫ్‌ అధ్యక్షులు జ్యోత్న్స, నిర్వహణా కమిటీ సభ్యులు స్వరూపారాణి, పి.విజయ, ప్రముఖ రచయిత్రి సత్యవతి, వసుంధర, ఎ.కుసుమ, ఝాన్సి, ఎ.సంధ్య, ఎ.కుసుమ, ఎ.పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.

➡️