ఎపి చెరకు రైతుల సంఘం డిమాండ్
ప్రజాశక్తి – ద్వారకా తిరుమల : చెరకు టన్నుకు 9.5 రికవరీ శాతంపై రూ.నాలుగు వేలు మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ చెరకు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రాపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తక్కెళ్లపాడు, గుణ్ణంపల్లి గ్రామాల్లో సంఘం నేతలు పర్యటించి చెరకు పంటను పరిశీలించారు. తక్కెళ్లపాడులో చెరకు రైతు ముల్లంగి ఈశ్వరరెడ్డి సాగు చేసిన 2468 విత్తనం ఎకరాకు 70 టన్నులు దిగుబడి రావడంతో సాగు వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాల్లో సాగయ్యే చెరకు పంట కాస్త ఐదు వేల ఎకరాలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా చెరకు రైతులు సంక్షోభంలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చెరకు ఫ్యాక్టరీలు మూతపడ్డాయని, చెరకు పంటపై ఆధారపడిన రైతులు, కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు. మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించాలని, చెరకు పంటకు రాష్ట్ర ప్రభుత్వం సలహా ధర ప్రకటించాలని కోరారు. చెరకు రైతులను ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
