బెయిల్‌ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం : పోసాని

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : చంద్రబాబు నాయుడు, పవన్‌కల్యాన్‌లను దూషించిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు గుంటూరులో జడ్జి ఎదుట మంగళవారం హాజరుపరిచారు. పిటి వారెంట్‌పై కర్నూలు నుంచి తీసుకొచ్చి శ్యామలనగర్‌లో ఉన్న జడ్జి నివాసంలో హాజరుపరిచారు. విచారణ అనంతరం పోసాని కృష్ణమురళికి న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. అంతకుముందు పోసాని తరుఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వ్యక్తిగత కోపంతో ఫిర్యాదు చేశారని, ఈ కేసులో సెక్షన్‌ 111 వర్తించదని తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి సమక్షంలో పోసాని కన్నీరు పెట్టుకున్నారు. నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, రెండు ఆపరేషన్లు చేసి స్టంట్‌లు వేశారని కంటతడిపెట్టుకున్నారు. నాకు భార్యాబిడ్డలు ఉన్నారని తెలిపాడు. రెండు రోజుల్లో బెయిల్‌ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుటే లాయర్లతో పోసాని వాపోయారు.

➡️