ప్రొఫెసర్‌ సాయిబాబాది హత్యే : సుంకర రాజేంద్రప్రసాద్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రొఫెసర్‌ సాయిబాబాను సామూహికంగా హత్య చేశారని ఐలు నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు సుంకర రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. హత్యలో కేంద్ర ప్రభుత్వం, న్యాయ, పోలీసు, వైద్య వ్యవస్థలు కీలకంగా ఉన్నాయన్నారు. విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సాయిబాబా సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. 24 గంటలు జైలులో పెట్టేందుకు అవకాశం లేని కేసులో ఆయనను పదేళ్లు ఉంచారన్నారు. బెయిల్‌ కూడా ఇవ్వలేనంత ఘోరం ఏం చేశారని ప్రశ్నించారు. రాజకీయ ఖైదీని జైలులో అంత తీవ్రంగా హింసించాల్సిన అవసరం ఏముందన్నారు. ఈ కేసులో పాలకులతో లాలూచీపడి చట్టాలకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు ఇంకా ఆ బాధ్యతల్లో కొనసాగే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. స్టాన్‌ స్వామి మరణించిన జులై 5న ఉపా బాధితుల దినంగా నిర్వహించుకోవాలని కోరారు. ‘అక్టోబరు 12న న్యాయ వ్యవస్థ ఖనన దినంగా జరపాల్సిన అవసరం ఉందని’ రాజేంద్ర ప్రసాద్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపా చట్టాన్ని తీసుకొచ్చిందని, అనేక సవరణల అనంతరం ఆ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీనే అర్బన్‌ నక్సలైట్‌గా మోడీ ప్రకటించారని చెప్పారు. హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రస్తుతం న్యాయ వ్యవస్థ వైకల్యంతో వీల్‌ఛైర్‌లో ఉందని, దీనికి వైద్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రొఫెసర్‌ సాయిబాబా ఆశయాల సాధనకు ప్రశ్నిద్దామని, ప్రశ్నించడం నేర్పుదామని చెప్పారు. ఐఎపిఎల్‌ నాయకులు పి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఉపా చట్టం ఒక సాయిబాబాకే పరిమితం కాలేదని, వేలాది మంది సాయిబాబాలు జైళ్లలో మగ్గిపోతున్నారని చెప్పారు. న్యాయ వ్యవస్థలో లోపాలను ప్రశ్నించాల్సిన సమయం వచ్చిందన్నారు. హైకోర్టు న్యాయవాది బి శ్రీనివాసరావు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌ మాధవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపర శ్రీనివాసులు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు, హైకోర్టు సీనియర్‌ న్యాయవాది వై కోటేశ్వరరావు, పౌరహక్కుల సంఘం నాయకులు డి సురేష్‌ కుమార్‌ ప్రసంగించారు. ఐలు జిల్లా కార్యదర్శి వి కోటేశ్వరరావు, నగర కార్యదర్శి వి రాజారత్నం తదితరులు పాల్గొన్నారు.

➡️